మాఫియాను వదిలిపెట్టం.. అఖిలేష్‭కు సీఎం యోగి వార్నింగ్

మాఫియాను వదిలిపెట్టం.. అఖిలేష్‭కు సీఎం యోగి వార్నింగ్

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా.. సమాజ్ వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పై మండిపడ్డారు. ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని బహిరంగంగా చంపడం పై సభలో చర్చ జరిగింది. దీంతో యోగి, అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

2015లో జరిగిన రాజు పాల్ హత్య కేసులో.. ప్రధాన సాక్షి అయిన ఉమేశ్ పాల్ ఈ శుక్రవారం దారుణహత్యకు గురయ్యారు. ఉమేశ్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేసి.. కాల్పులు జరిపారు. ఉమేశ్ పాల్ హత్య పై మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. యోగి సర్కార్ పై నిప్పులు చెరిగారు. యూపీ ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఉమేశ్ హత్య దారుణమన్నారు. అయితే.. దీనిపై అఖిలేష్ యాదవ్ కు యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. బాధితుల కుటుంబం అతిక్ అహ్మద్ ఏ ఈ హత్య చేయించాడని ఆరోపిస్తున్నారని యోగి అన్నారు. బాధితులు ఆరోపిస్తున్న అతిక్ అహ్మద్.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అని గుర్తు చేశారు. నేరస్తులకు మీరే మద్దతు ఇస్తున్నారంటూ అఖిలేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మాఫియాలో అతిక్‌ అహ్మాద్‌ కూడా భాగమే. ఇలాంటి చర్యలను తాము అసలు సహించమని అన్నారు. మాఫియాను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అఖిలేష్‌ యాదవ్‌ మాఫియాకు గాడ్‌ఫాదర్  అంటూ ఆయన వైపు వేలు చూపిస్తూ యోగి కామెంట్స్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.