వలస నేతకు టికెట్ ఎలా ఇస్తారు?.. అధిష్టానంపై కార్వాన్ కాంగ్రెస్ నేతల ఆగ్రహం

వలస నేతకు టికెట్ ఎలా ఇస్తారు?.. అధిష్టానంపై కార్వాన్ కాంగ్రెస్ నేతల ఆగ్రహం

మెహిదీపట్నం, వెలుగు: ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకుడికి కార్వాన్ టికెట్ ఎలా ఇస్తారని ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు కూరాకుల కృష్ణ, ముంగి రఘు పాల్ రెడ్డి అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  పార్టీ కోసం ఏనాడు పనిచేయని ఉస్మాన్ బిన్ హజరేకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  గతంలో 2018 ఎన్నికల్లో ఎంఐఎంతో  కుమ్మక్కైన ఉస్మాన్ బిన్‌కు టికెట్ ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు.  లంగర్‌‌ హౌస్‌లో సమావేశమైన నేతలు మాట్లాడుతూ.. ఉస్మాన్ బిన్‌ హజరేకు బీ ఫాం ఇస్తే సహకరించేది లేదన్నారు.

తాము ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నామన్నారు.  జెండా పట్టుకుని జనంలో తిరుగుతున్నామని, పార్టీ కోసం పని చేయని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా గుర్తించి  తమలో ఒకరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించుకుంటామన్నారు.  సమావేశంలో కాంగ్రెస్ కార్వాన్ నియోజకవర్గం ఏ, బి బ్లాక్ అధ్యక్షుడు కూరాకుల కృష్ణ, చంటిబాబు,  గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ముంగి రఘుపాల్ రెడ్డి,  ఆకుల చంద్రశేఖర్,  అబ్దుల్ హమీద్,  గిరి,  వినోద్ సింగ్, నాయకులు  పాల్గొన్నారు.