ఇండియా ఫాస్ట్‌ బౌలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది

ఇండియా ఫాస్ట్‌ బౌలింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది

వెటరన్ పేసర్ షాన్ పొలాక్ మెచ్చుకోలు
న్యూఢిల్లీ: ప్రస్తుత క్రికెటింగ్‌ వరల్డ్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లాంటి వైవిధ్యమైన బౌలర్లను కలిగిన టీమిండియాను వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్‌ టీమ్‌గా చెప్పొచ్చు. ఎంతటి బౌలర్లనైనా సులువుగా ఎదిరించే బ్యాట్స్‌మెన్స్‌, ఏ వికెట్‌పైన కూడా బాల్‌ను గింగిరాలు తిప్పగల వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్‌కు ఇండియా పెట్టింది పేరనేది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు బ్యాట్స్‌మెన్స్‌, స్పిన్నర్స్‌తోపాటు ఇండియా అమ్ముల పొదిలో పేసర్స్‌ ప్రధాన ఆయుధంగా ఉన్నారనేది వాస్తవం. ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్‌ సైనీ, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లాంటి యంగ్ ప్లేయర్స్‌ రెడ్ బాల్ క్రికెట్‌లో ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తుండటం మెన్ ఇన్ బ్లూ బెంచ్ స్ట్రెంగ్త్‌ను కూడా తెలియజేస్తోంది. టీమిండియా పేస్ అటాక్‌లో వచ్చిన మార్పులపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, వెటరన్ పేసర్ షాన్ పొలాక్ పలు వ్యాఖ్యలు చేశాడు.

‘అవును, ఫాస్ట్‌ బౌలింగ్ విభాగంలో ఇండియా చాలా పటిష్టంగా ఉంది. వాళ్ల పేస్ బౌలింగ్‌లో డెప్త్, వేరియేషన్స్ ఉన్నాయి. హైట్ తక్కువ ఉన్న బౌలర్స్‌తోపాటు పొడగరి పేసర్స్‌ కూడా వారికి ఉన్నారు. వీళ్లు చాలా టాలెంటెడ్ గాయ్స్‌. వీళ్ల మధ్య మంచి సమతూకం ఉంది. ముగ్గురు లేదా నలుగురు బౌలర్స్‌ను ఎంచుకున్నా అందుబాటులో ప్లేయర్స్‌ రెడీగా ఉన్నారు. ఒకప్పుడు శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ లాంటి వారికి రీప్లేస్‌మెంట్ బౌలర్స్‌ సరిగ్గా లేరు. మూడో బౌలర్‌‌ లేదా బ్యాకప్ బౌలర్ ఆడినా వాళ్ల బౌలింగ్‌లో పస, క్వాలిటీ లేకపోవడంతో ఇండియా వెనుకబడేది. మేం బుమ్రాతో మాట్లాడాం. అందరూ బాగా పోటీ పడుతున్నారని, తానెప్పుడూ బాగా పెర్ఫామ్ చేయాలని అనుకుంటామని బుమ్రా అన్నాడు. కొన్ని గేమ్స్‌లో విఫలమైతే తమ ప్లేస్‌లో మరొకరు రావొచ్చని, ఆ స్థానాన్ని వారు ఆక్రమించొచ్చని బుమ్రా చెప్పాడు. ఇది టీమిండియాకు సానుకూల పరిస్థితి’ అని పొలాక్ పేర్కొన్నాడు.