మహిళా రిజర్వేషన్ బిల్లులోబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి : ఆర్ కృష్ణయ్య

మహిళా రిజర్వేషన్ బిల్లులోబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి  : ఆర్ కృష్ణయ్య
  • అప్పుడే నిజమైన రాజ్యాధికారం
  • ప్రధాని మోదీకి ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి 

బషీర్​బాగ్, వెలుగు: పార్లమెంట్​లో పాసైన మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పిస్తేనే నిజమైన రాజ్యాధికారం దక్కుతుందని ప్రధాని మోదీకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్ క్లబ్​లో జరిగిన జాతీయ బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. 

దేశ జనాభాలో సగం ఉన్న బీసీ మహిళలకు కోటా లేకుండా మహిళా బిల్లుకు సార్ధకత ఉండదని, రాజకీయ రిజర్వేషన్లతోపాటు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు తగ్గాలంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అవసరమన్నారు. బిహార్‌‌‌‌లో నిషేధం తర్వాత నేరాలు తగ్గాయని గుర్తుచేశారు. రైతు బంధు డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. 

సమావేశంలో తెలంగాణ బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా గంగాపురం పద్మను కృష్ణయ్య నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ తదితరుల పాల్గొన్నారు.