బీసీ రిజర్వేషన్ల కేసు కోర్టులో ఉండగా..మున్సిపల్ ఎన్నికలకు ఎట్ల పోతరు?.. ఆర్ కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్ల కేసు కోర్టులో ఉండగా..మున్సిపల్ ఎన్నికలకు ఎట్ల పోతరు?.. ఆర్ కృష్ణయ్య
  • ఇది బీసీలను దగా చేయడమే: 
  • రాజ్యసభ సభ్యుడు ఆర్​ కృష్ణయ్య 

బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. 42% బీసీల రిజర్వేషన్ల కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు, ఎన్నికలకు ఎలా పోతారని ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్ బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్ క్లబ్‌‌‌‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. 

రిజర్వేషన్ల అంశంపై తీర్పు వచ్చే వరకు వేచి ఉండకుండా.. ఎన్నికలకు పోవడం బీసీలను దగా చేయడమే అవుతుందన్నారు. ప్రభుత్వం మొదటి నుంచి బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ ఊరించి మోసం చేసిందని మండిపడ్డారు. అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను 28 శాతానికి కుదించారని ఆరోపించారు. 

బీసీలకు 65 మున్సిపాలిటీలకు గాను 35 స్థానాలు, కార్పొరేషన్లలో 10 స్థానాలకు 3 మాత్రమే కేటాయించారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల కేసు కోర్టులో తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసు కొలిక్కి వచ్చే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.