టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం: ఆర్. కృష్ణయ్య

టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం:  ఆర్. కృష్ణయ్య
  • అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం బీసీలకు టికెట్లు కేటాయించాలి
  • బీసీ బిల్లు కోసం 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ

బషీర్ బాగ్, -వెలుగు: రాజకీయ పార్టీలు ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో బీసీలను మోసం చేస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు , బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు.  బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కాచిగూడ మున్నూరు కాపు భవన్ లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బీసీ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలంగాణ బీసీ సంక్షేమ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యం, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.  పార్లమెంట్‌లో  బీసీ బిల్లు అమలైనప్పుడు మాత్రమే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు.  జనాభా దామాషా ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు బీసీలకు మొండి చెయ్యి చూపుతున్నారని విమర్శించారు.

గత 40 ఏళ్లుగా  బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నా రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు.  బీసీ బిల్లు కోసం త్వరలో ఐదు లక్షల మందితో పేరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ పెట్టి , కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని అన్నారు.  రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50 శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆయా పార్టీలకు బీసీలు తమ ఓటు తో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ మహా సభలో 63 బీసీ సంఘాల నాయకులు , 28 బీసీ ఉద్యోగుల సంఘ నాయకులు పాల్గొన్నారు.