విద్యుత్ సంస్థల్లో 50% డైరెక్టర్ పోస్టులు బీసీలకు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య

విద్యుత్ సంస్థల్లో 50%  డైరెక్టర్ పోస్టులు బీసీలకు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు : విద్యుత్ సంస్థలో  బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. శనివారం హైదరాబాద్, కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  సమావేశం జరిగింది. దీనికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, తెలంగాణ విద్యుత్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడెపాక కుమార్ స్వామిలతో కలిసి ఆర్.కృష్ణయ్య హాజరై, మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్ కో, జెన్ కో , ఎస్పీడీసీఎల్, ఎన్సీడీసీఎల్  డైరెక్టర్ పోస్టుల్లో బీసీ ఉద్యోగులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని తెలిపారు. 

 డైరెక్టర్ పోస్టుల్లో 50 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్నట్లే బీసీలకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పారు. డైరెక్టర్ పోస్టులకు కూడా 62 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయోపరిమితి పెంచాలని ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లు కల్పించకపోతే , విద్యుత్ సంస్థల గేట్లకు తాళాలు వేస్తామని ఆయన హెచ్చరించారు.