పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాలి... ఆర్.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌

పార్లమెంటులో మహిళా బిల్లు పెట్టాలి...  ఆర్.కృష్ణయ్య డిమాండ్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లు పెట్టి, బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు పద్మలత ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్‌‌‌‌చార్జి కర్రి వేణుమాధవ్ అధ్యక్షత వహించారు.

ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్‌‌‌‌లో మహిళా బిల్లు ప్రవేశపెట్టి, బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్-కోటా ఇవ్వాలని, అప్పుడే బీసీ మహిళలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. ఇప్పటికే మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని, లోక్‌‌‌‌సభలో కూడా ప్రవేశపెట్టి చట్టం చేయాలని కోరారు. కాగా, తెలంగాణలో మద్యపాన నిషేధంపై మహిళలు ఉద్యమించాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనంతగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. రోడ్ల మీదనే మద్యం తాగుతున్నారని, ఈ పరిస్థితిని అరికట్టకపోతే తెలంగాణలో శాంతి -భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.