- ఈ జీవోతో బీసీల రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు: ఆర్.కృష్ణయ్య
బషీర్‌బాగ్/ముషీరాబాద్, వెలుగు: రెండేండ్లుగా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఊరించి ఊరించి బీసీ సమాజానికి నిరాశ మిగిల్చిందని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 బీసీల రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు లాంటిదని, దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని విద్యానగర్, అంబర్‌పేట, బషీర్‌బాగ్ చౌరస్తాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జీవో 46కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. బీసీ సంఘాల జేఏసీ నాయకులతో కలిసి జీవో 46 పత్రులను దగ్ధం చేసి, అనంతరం ఆయన మాట్లాడారు. బీసీలను రాజ్యాధికారం నుంచి దూరం చేసే కుట్రలో భాగంగా ఈ జీవోను విడుదల చేశారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్నారు.
రెండేండ్లుగా ఆశ చూపి నోటికాడి బుక్కను లాక్కుంటారా అని ప్రశ్నించారు. ఇక తాడోపేడో తేల్చుకుంటామన్నారు. జీవోను వెనక్కి తీసుకునే వరకు బీసీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో నేతలు నీల వెంకటేశ్, రాజేందర్ ముదిరాజ్, పగిళ్ల సతీశ్, ర్యాగ అరుణ్ కుమార్, అనంతయ్య, నాగేశ్వరరావు, నూకాలమ్మ, రాజు గౌడ్, భూమన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
