ఆగస్టు 8న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్య పిలుపు

ఆగస్టు 8న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ఆర్.కృష్ణయ్య పిలుపు

పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు8వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి డిమాండ్ చేస్తూ పార్లమెంటు వద్ద ఆగస్టు 8వ తేదీన ప్రదర్శన, ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆదివారం (జులై 30న) ఛలో ఢిల్లీ పోస్టర్ ను ఆవిష్కరించారు. 

ఆగస్టు 8న పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన జరపాలని ఆర్. కృష్ణయ్య బీసీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 75 సంవత్సరాలుగా బీసీలకు ఏ నాయకుడు కూడా న్యాయం చేయలేదన్నారు. బీసీల వాటా బీసీలకు ఇవ్వాలనే తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీల విషయంలో స్పందించకపోతే రాబోయే రోజుల్లో విప్లవం తప్పదని హెచ్చరించారు. జన గణనలో కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున వేలామందితో భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 

కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసుకుంటూ వస్తోందని ఆరోపించారు ఆర్. కృష్ణయ్య. బీసీలకు రాజ్యాంగ హక్కులు కావాలన్నారు. ఈ దేశంలో బీసీలు వాటాదారులని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే దేశంలో తిరుగుబాటు వస్తుందని హెచ్చరించారు. ఈ దేశంలో బీసీలకు సంపదలో, అధికారంలో, విద్యలో వాటా రాలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి.. బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బీసీలకు ప్రధాని న్యాయం చేయకపోతే భవిష్యత్తులోనూ ఏ నాయకుడు చేయరని చెప్పారు.