 
                                    బషీర్‌బాగ్, వెలుగు: బీసీలకు చట్టపరంగా రిజర్వేషన్ల అమలు, రాజ్యాధికారం సాధించడమే తన చివరి కోరిక అని, దీని కోసం తుది శ్వాస వరకు పోరాడుతానని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. చట్టబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పించాలే తప్ప.. పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకునేది లేదన్నారు. బీసీలకు బిచ్చం వద్దని, న్యాయంగా కావాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తు కార్యాచరణపై గురువారం లక్డీకాపుల్‌లోని హోటల్‌లో 130 బీసీ కుల సంఘాలతో ఆర్.కృష్ణయ్య సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్లు అమలఅయ్యే వరకు పోరాటం ఆగదని, నవంబర్ రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రథయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. బీసీ బంద్‌లో 350 మంది బీసీ బిడ్డలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని, ఇది అన్యాయమన్నారు.

 
         
                     
                     
                    