
బషీర్ బాగ్, వెలుగు; ముఖ్యమంత్రి కేసీఆర్ తన జీవితమంతా బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరించారని బీసీ సంక్షేమం సంఘం జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ వ్యతిరేకి అయిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జనం త్వరలోనే గద్దె దింపుతారని ఆయన పేర్కొన్నారు. బీసీల డిమాండ్లు సాధించుకోవాలంటే అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ నారాయణగూడలో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి అధ్యక్షతన ‘బీసీ బంధు, భవిష్యత్తు కార్యాచరణ’ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణయ్య, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ రాములు, కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, అనిల్, ఆప్ కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. కృష్ణయ్య మాట్లాడుతూ 2018 ఎన్నికల ముందు బీసీలకు రుణాల పేరితో కేసీఆర్ ఎలా మోసం చేశారో ఇప్పుడు కూడా అలాగే మోసం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.
గతంలో 5.70 లక్షల మందితో అప్లికేషన్లు తీసుకొని 40 వేల మందికే 60 వేల రూపాయల రుణాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో 56 శాతం జనాభా , 62 లక్షల కుటుంబాలు ఉన్న బీసీలకు రూ.100 కోట్లు రుణాల కోసం కేటాయించడం సిగ్గుచేటని కృష్ణయ్య మండిపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీలకు లక్ష రూపాయలు ప్రకటించి మరోమారు బీసీలను కేసీఆర్ మోసంచేసే ప్రయత్నం చేస్తున్నారని కోదండరాం అన్నారు. అది ఎన్నికల స్టంట్ అని ఆయన పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్లకు ఇంతవరకూ ఒక్క పైసా కూడ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. బీసీ సంక్షేమం కింద ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. వాటిలో 40 నుంచి 50 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తున్నదని కాగ్ పేర్కొన్నదని ఆయన గుర్తుచేశారు. రకరకాల వృత్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన నిధుల నుంచి ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టడం లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని బీసీలందరిలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు.