- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు : పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని, దేశంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చే పార్టీకే బీసీల మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 16 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా.. బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ తో నెట్టుకొస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూన్ లో పార్లమెంట్ ముందు భారీ నిరసన ప్రదర్శన చేపడతామన్నారు.
శుక్రవారం కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. వికసిత్భారత్అంటే అంబానీ, అదానీలు అభివృద్ధి చెందడం కాదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగుపడినప్పుడే వికసిత్ భారత్ అవుతుందన్నారు. 37 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణచేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులే తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లలో క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని డిమాండ్చేశారు.
కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ బిల్లుకు, ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ బీసీ వ్యతిరేక విధానాన్ని వీడకపోతే, లోక్సభ ఎన్నికల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ , నాయకులు కోల జనార్దన్, పి.సుధాకర్ ముదిరాజ్, నందగోపాల్, చౌటుపల్లి సురేశ్, ఉదయ్ నేత, టి.రాజ్ కుమార్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.