- బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వాల్సిందే
- అందుకోసం రాష్ట్రంలో అగ్గి మండియ్యాలి: ఆర్ కృష్ణయ్య
- బీసీ జన వన భోజనాల కార్యక్రమంలో వెల్లడి
ఎల్బీనగర్, వెలుగు: బీసీలంతా న్యాయం, ధర్మం అడుగుతున్నామని, తమకు రావాల్సిన వాటా వచ్చేంతవరకు రాష్ట్రంలో అగ్ని మండియ్యాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. వనస్థలిపురంలోని హరినవస్థలిలో ఆదివారం ఏర్పాటు చేసిన బీసీ జన వన భోజనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎవడయ్య జాగీరు వాటాను తాము అడగడం లేదని, న్యాయబద్ధంగా రావాల్సిన వాటా అడుగుతున్నామన్నారు.
ఎన్నో కుట్రలు పన్ని గత ఎన్నికల్లో రిజర్వేషన్ వాటా రాకుండా అడ్డుకున్నారన్నారు. ఈ బీసీ జన వన భోజనాల కార్యక్రమం రాజ్యాధికార సాధనకు కొత్త పంథా అని చెప్పారు. కార్యక్రమం నిర్వహించిన బీసీ నాయకులను అభినందించారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి బీసీలను ఏకం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సాయి ఈశ్వరాచారికి నివాళులర్పించి మౌనం పాటించారు. అక్కడున్న కొందరు ఈశ్వరాచారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేశారు. చెరుకు సుధాకర్, బాలగొని బాల్ రాజు గౌడ్, టి చిరంజీవులు, నిర్వాహకులు చామకూర రాజు, కెవి గౌడ్, పుష్పగిరి తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో చర్చ జరగాలి
ముషీరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన అంశంగా బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ లో సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గవ్వల భరత్ కుమార్ ను నియమించారు. అనంతరంకృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీల పరంగా జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 42 శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలన్నారు.
