V6 News

ఐపీఎస్ టూ పొలిటిషియన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ IPS ఆర్ శ్రీలేఖ ఘన విజయం

ఐపీఎస్ టూ పొలిటిషియన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ IPS ఆర్ శ్రీలేఖ ఘన విజయం

తిరువనంతపురం: కేరళ తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్, ఆ రాష్ట్ర మాజీ డీజీపీ ఆర్ శ్రీలేఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లోని 41వ వార్డు శాస్తమంగళం నుంచి బీజేపీ తరుఫున ఎన్నికల బరిలోకి దిగిన ఆమె సీపీఐ-ఎం అభ్యర్థి అమృత ఆర్‌ను 708 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ విజయంతో తిరువనంతపురం మేయర్ అభ్యర్థి రేసులో ఆమె ముందు వరుసలో ఉన్నారు.

కాగా, 2025, డిసెంబర్ 9న జరిగిన కేరళ తొలి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. గత కొన్ని దశాబ్ధాలుగా కామ్రేడ్ల కంచుకోటగా ఉన్న కేరళలో కాషాయ పార్టీ సత్తా చాటింది. ఏకంగా కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) భారీ విజయాన్ని సాధించింది. 

తిరువనంతపురం కార్పొరేషన్‎లో మొత్తం 101 వార్డులు ఉండగా ఏకంగా 50 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. తద్వారా తిరువనంతపురం కార్పొరేషన్‎లో గత 45 సంవత్సరాలుగా తిరుగులేని అధిపత్యం ప్రదర్శిస్తోన్న అధికార ఎల్డీఎఫ్‎కు చెక్ పెట్టింది కమలం పార్టీ. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీశాయి.

ఐపీఎస్ టూ పొలిటిషియన్.. ఆర్ శ్రీలేఖ బ్యాక్ గ్రౌండ్ ఇదే: 

కేరళ రాజధాని తిరువనంతపురంకు చెందిన శ్రీలేఖ లెక్చరర్‌గా తన ప్రొషెషనల్ కెరీర్ స్టార్ట్ చేశారు. తరువాత ఆమె ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ బి ఆఫీసర్‌గా పని చేశారు. 1987లో 26 సంవత్సరాల వయసులో శ్రీలేఖ ఐపీఎస్‎గా ఎంపికయ్యారు. తద్వారా కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐపీఎస్‎గా 33 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్‌లో అలప్పుజ, పతనంతిట్ట, త్రిస్సూర్‌లలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో సహా కీలక పదవులను నిర్వహించారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో కూడా ఆమె కొన్నాళ్లు వర్క్ చేశారు.  ఆమె కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) హోదాలో పదవీ విరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2024లో తన భర్తతో కలిసి బీజేపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కేరళ బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. 

ఈ క్రమంలోనే 2025, డిసెంబర్ 9న జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలో శాస్తమంగళం (Sasthamangalam) వార్డు నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. శ్రీలేఖతో పాటు తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 50 వార్డుల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీలేఖ తిరువనంతపురం మేయర్‎గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.