తిరువనంతపురం: దక్షిణాదిలో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న బీజేపీకి కేరళలో బిగ్ షాక్ తగిలింది. కేరళలో ఆ పార్టీ కీలక నాయకురాలు, మాజీ డీజీపీ శ్రీలేఖ తిరువనంతపురం కార్పొరేషన్‌లోని శాస్తమంగళం వార్డు కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తిరువనంతపురం మేయర్ వి.వి. రాజేష్‌కు శనివారం (అక్టోబర్ 3) రాజీనామా లేఖ సమర్పించారు. అక్టోబర్ 5న రాజీనామా లేఖ కాపీని జిల్లా కలెక్టర్‌కు అందజేస్తానని ఆమె తెలిపారు. పార్టీ నాయకత్వంతో వచ్చిన విభేదాలు, మేయర్ పదవి దక్కకపోవడం వంటి కారణాల వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎవరీ శ్రీలేఖ..?
కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీలేఖ1987 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. కేరళ కేడర్‌లో చేరిన మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఆమే. తన 33 ఏళ్ల సర్వీస్‌లో శ్రీలేఖ వివిధ విభాగాల్లో పని చేసి పవర్ ఫుల్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారు. సీబీఐ, విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో, జైళ్ల శాఖ, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా విభిన్న రంగాల్లో పని చేశారు. ముఖ్యంగా సీబీఐలో తన మార్క్ చూపించారు. సీబీఐలో అవినీతిపై ఆమె చేసిన దాడుల వల్ల ఆమెకు రైడ్ శ్రీలేఖ పేరు వచ్చింది. 2017లో ఆమె డీజీపీ హోదా పొందారు. 2020, డిసెంబర్ 31 ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డీజీపీగా ఆమె పదవీ విరమణ చేశారు.
రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ ఎంట్రీ:
ఐపీఎస్‌గా పదవి విరమణ అనంతరం శ్రీలేఖ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2024లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఆమె జాయిన్ అయ్యారు. అనంతరం ఆమెను కేరళ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కూడా నియమించారు. 2025లో జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ తరపున శాస్తమంగళం వార్డు నుంచి పోటీ చేసి కౌన్సిలర్గా ఘన విజయం సాధించారు.
ALSO READ : పైలట్‌ను గొడ్డలితో నరికి.. విమానాన్ని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించిండు
ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా విజయం సాధించి కేరళ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి తిరువనంతపురం మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మేయర్ పదవి రేసులో శ్రీలేఖ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ హైకమాండ్ వి.వి. రాజేష్‌కు తిరువనంతపురం మేయర్ పదవి కట్టబెట్టింది. దీంతో శ్రీలేఖ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన కౌన్సిలర్ పదవికి రిజైన్ చేశారు.
