- కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ
- ఆశావాహుల్లో ఉత్కంఠ
- గత ఎన్నికల్లో ఇండిపెండెంట్లది కీలక పాత్ర
సూర్యాపేట, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలు మేయర్, చైర్మన్పీఠాలపై గురి పెట్టాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీలతోపాటు నల్గొండ కార్పొరేషన్ కు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. దీంతో మున్సిపల్రాజకీయ వేడి మొదలైంది. పార్టీలు మారాలనుకునేవారు, టికెట్ ఆశావాహులు.. ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. మెజార్టీ స్థానాలు దక్కించుకొని మేయర్, చైర్మన్సీట్లను కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ తోపాటు బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా యి.
కాంగ్రెస్ వరుస విజయాలతో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ పూర్వవైభవాన్ని సాధించాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బీజేపీ గత ఎన్ని కలకంటే మెరుగైన ఫలితాల కోసం కసరత్తు ముమ్మరం చేసింది. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ ఎంపికలో ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించడంతో.. ఈసారి కూడా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక్కో పార్టీలో అర డజన్‌కు పైగా ఆశావహులు
సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా.. చైర్మన్‌పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ప్రతీ మున్సిపాలిటీ నుంచి ఒక్కో పార్టీ తరఫున అర డజన్ కు పైగా ఆశావాహులు ఉన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఈ సంఖ్య మూడింతలకు పైగా ఉంది.
- కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులున్నాయి. చైర్మన్పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో అధికార పార్టీలోని పలువురు ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కోదాడ మాజీ సర్పంచులు యెర్నేని బాబు, పార సీతయ్య తమ సతీమణులను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ కు చెందిన గుండపనేని పద్మావతి చైర్ పర్సన్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె భర్త నాగేశ్వరరావు పోటీ పడే అవకాశాలున్నాయి. మరోవైపు పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి సమీప బంధువు దేవర మల్లీశ్వరి, మాజీ ఉప సర్పంచ్ వంటిపులి వెంకటేశ్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
- తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ జనరల్ కు కేటాయించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు అత్యంత సన్నిహితుడు సుంకరి జనార్ధన్ చైర్మన్అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అశోక్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు భిక్షం రెడ్డి కూడా తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
- నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ జనరల్ కావడంతో.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొణతం చిన్న వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఒకరిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైనల్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి డీసీసీబీ మాజీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, జనసేన పార్టీలు కొన్ని వార్డుల్లో తమ అభ్యర్థులను నిలిపేందుకు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేయడానికి ఒక్కో వార్డుకు దాదాపు10 మంది పోటీ పడుతున్నారు.
- హుజూర్ నగర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి మంత్రి ఉత్తమ్ అనుచరుడిగా పేరున్న తన్నీరు మల్లికార్జునరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ పోటీకి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ లో టికెట్ రానివారిని చేర్చుకొని పోటీకి దింపాలని బీఆర్ఎస్, ఇతర పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో చాలా వార్డుల్లో కాంగ్రెస్ కు చెందినవారే ప్రత్యర్థులుగా నిలిచే అవకాశాలున్నాయి.
మేయర్ స్థానంపై చర్చ
సుదీర్ఘ కాలం తర్వాత నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయింది. మేయర్ సీటు జనరల్ మహిళకు కేటాయించడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి భార్య చైతన్య, బీఆర్ఎస్ నుంచి మందడి సైదిరెడ్డి భార్య లిఖిత, బీజేపీ నుంచి బీసీ నేత పిల్లి రామరాజు యాదవ్భార్య సత్యవతి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. వీరిలో చైతన్య, సత్యవతి, రామరాజు యాదవ్ మాజీ కౌన్సిలర్లు. మున్సిపాలిటీ చరిత్రలో ఒక్కసారి మాత్రమే ముస్లిం, మైనార్టీ మహిళలకు వైస్చైర్మన్పదవి దక్కింది. ఈసారి ముస్లిం లేదా ఎస్సీకి డిప్యూటీ మేయర్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.
