డీసీసీ ప్రెసిడెంట్ పదవి దక్కెదెవరికో !..కాంగ్రెస్ నేతల పోటాపోటీ

డీసీసీ ప్రెసిడెంట్ పదవి దక్కెదెవరికో !..కాంగ్రెస్ నేతల పోటాపోటీ
  • తమకంటే తమకేనని ఏడుగురు నేతల పంతం 
  • సయోధ్య యత్నాల్లో ఎమ్మెల్యేలు 
  • మొదట 26 మందితో కార్యవర్గం నియామకం 
  • తర్వాత ప్రెసిడెంట్ ఎంపిక 

నిజామాబాద్, వెలుగు : జిల్లా కాంగ్రెస్​ ప్రెసిడెంట్ పదవి ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ పదవి కోసం ఏడుగురు  నేతలు పోటీ పడుతుండడం పార్టీ ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా.. ఎవరూ వెనక్కు తగ్గడంలేదు. ఈనెల 15 నాటికి డీసీసీ కమిటీలు ఏర్పాటు చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​​గౌడ్ ప్రకటించడంతో ఆశావహులు ముమ్మరంగా ప్రయాత్నాలు చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో అధ్యక్షుడి ఎంపిక ఇబ్బందిగా మారింది. 

స్థానిక ఎన్నికల నేపథ్యంలో డీసీసీ అధ్యక్ష పదవికి ప్రాధాన్యం పెరుగనుంది. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్​రెడ్డి, ఆరేంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి డీసీసీ రేసులో ఉన్నారు. బీసీ లీడర్లు శేఖర్​గౌడ్​, గ్రంథాలయ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, నరాల రత్నాకర్​ కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారో స్పష్టం కానప్పటికీ ఏడుగురు నేతలు తనకంటేతనకేనని పోటీ పడుతుండడం విశేషం. ఈ నెల10న నిజామాబాద్​లో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి  ఆశావహులతో విడివిడిగా మీటింగ్ పెట్టగా ఆశావహులంతా తమకే పదవి కట్టబెట్టాలని గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అభిప్రాయాన్ని కూడా సేకరించాక తన సొంత జిల్లా పదవి విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్ తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

ముందుగా డీసీసీ కార్యవర్గం ఎంపిక

జనవరిలో డీసీసీ కమిటీ పదవీ కాలం ముగిసింది. ప్రెసిడెంట్ భర్తీకి ఏకాభిప్రాయం సాధ్యం కానందున ముందుగా 26 మందితో కార్యవర్గాన్ని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.  పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్​చార్జి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, జిల్లా పార్టీ ఇన్​చార్జిగా కొత్తగా అపాయింట్ అయిన అజ్మతుల్లా హుస్సేనీ ఈనెల10న ఇందూర్ వచ్చి అప్లికేషన్లు తీసుకున్నారు. పార్టీకి చేసిన సేవలు, ఏ పదవి ఆశిస్తున్నారన్న వివరాలు సేకరించారు. డీసీసీ కమిటీతో పాటు టౌన్, మండల కమిటీలకు దరఖాస్తులు తీసుకోగా, అక్కడా అధ్యక్ష పదవికి నలుగురైదుగురు పోటీ పడుతున్నట్లు తేలింది.