గంజాయి ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు

గంజాయి ముఠాను పట్టుకున్న రాచకొండ పోలీసులు

రాచకొండ: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం... మహరాష్ట్రకు చెందిన పరశురాం తన ముఠా సభ్యులతో కలిసి ఒరిస్సా నుంచి మహరాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నాడు. ఇందుకోసం రెండు వాహనాల్లో మొత్తం 590 కిలోల గంజాయిని 104 ప్యాకెట్లుగా చేసి సరఫరా చేస్తున్నాడు. అయితే నిందితులు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారనే సమాచారాన్ని అందుకున్న ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు పక్కా ప్లాన్ తో  రైడ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

వారి నుంచి గంజాయితో పాటు రెండు కార్లు, 8 సెల్ ఫోన్లు, 1900 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా  మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సూర్యాపేటకి చెందిన సాయికుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ప్రధాన నిందితుడైన పరశురాం గతంలో విశాఖపట్నంలో గంజాయి తరలిస్తూ అరెస్ట్ అయ్యాడని తెలిపిన పోలీసులు... వనస్థలిపురం పీఎస్ లో కూడా అతడిపై కేసు నమోదు అయ్యిందన్నారు. మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.