రాచకొండ పోలీసులు ఓ ఘరానా దొంగల ముఠాను అరెస్టు చేశారు. నెల రోజులుగా పక్కా ప్రణాళిక ప్రకారం.. రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో పరిధిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కాయిల్స్ దొంగలిస్తున్న ముఠాను మే 5వ తేదీ శుక్రవారం పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 6గురు పరారిలో ఉన్నారు. నిందితుల నుండి రూ.లక్ష, 60 కేజీల కాపర్ కాయిల్స్, ఒక కార్, ద్విచక్రవాహనం, నాలుగు మొబైల్స్, ట్రాన్స్ ఫార్మర్ ను విప్పే పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ ఈ కేసు వివరాలు తెలిపారు. మొత్తం 306 ట్రాన్స్ ఫార్మర్ కాయిల్స్ ను ఈ ముఠా దొంగలించింది. ఈ ముఠా పైన ఇప్పటివరకు మొత్తం 173 కేసులు ఉన్నాయి. 81 కేసులలో ఇప్పటివరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఈ ముఠాను మొదటి సారిగా సీసీఎస్ ఎల్బి నగర్, భువనగిరి పోలీసులు కలిసి పట్టుకున్నారని సీపీ వెల్లడించారు.
ఈ ముఠాలోని 9 మంది ఇప్పటివరకు 173 కేసులలో నిందితులగా ఉన్నారని.. ప్రస్తుతం మరో 6గురు పరారిలో ఉన్నారని సీపీ చెప్పారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సహదేవ్ హజీరా, యుపి రాష్ట్రాలకు చెందిన అభిమన్యు రాజ్ బార్, నందులాల్ రాజ్ బార్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రాహుల్ రాజ్ బార్, రామచందర్, దొంగ సామగ్రి కొనే కుర్వ చిన్న నర్సింహులు, మహేష్, తూగుల రమణ రెడ్డి, రంజాని జయశ్రీ పరారిలో ఉన్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ పేర్కొన్నారు.