
ఎల్బీనగర్, వెలుగు: మహిళలు, బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన 203 పోకిరీలను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొని బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మెట్రోస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో 203 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
వీరిలో138 మంది మేజర్లు, 65 మంది మైనర్లు ఉన్నారన్నారు. వీరంతా సోషల్ మీడియాలో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, బాలికలతో అసభ్యకరంగా వ్యవహరించినట్లు గుర్తించామన్నారు. 14 మందిపై క్రిమినల్ కేసులు, 84 మందిపై పిటీ కేసులు నమోదు చేశామని, 116 మందికి కుటుంబ సభ్యుల ఎదుట కౌన్సెలింగ్ ఇచ్చామని వెల్లడించారు.