8 పదుల వయసులో సొంతకారు కల నెరవేర్చుకున్నాడు

8 పదుల వయసులో సొంతకారు కల నెరవేర్చుకున్నాడు

కొంతమందికి రిటైర్‌‌‌‌ అయ్యేలోపు ‘ఇల్లు కట్టుకోవాలి, యాత్రలు చేయాలి, కారు కొనుక్కోవాలి’ అని ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. వాటిని తీర్చుకోవాలనీ ఉంటుంది. అయితే, కొన్ని కొన్ని కారణాల వల్ల జీవితంలో అవి తీరకుండా మిగిలిపోతుంటాయి. కానీ, రాధాకృష్ణ చౌదరి మాత్రం ఎనభై ఐదేండ్ల వయసులో ‘సొంతంగా కారు కొనుక్కోవాలి’ అనే తన కోరికను తీర్చుకున్నాడు. అదెలాగంటే..

రాధాకృష్ణ (నానాజి) సొంతూరు సూరత్. భార్య శకుంతల చౌదరికి డెభ్భై తొమ్మిదేండ్లు. వీళ్లకు ముగ్గురు ఆడపిల్లలు. పెండ్లిళ్లు అయిపోయాయి. రాధాకృష్ణ జాబ్‌‌ చేస్తున్న టైంలో సొంతంగా కారు కొనుక్కోవాలని ఉండేది. కానీ, సంపాదనంతా పిల్లల చదువులకు, పెండ్లిళ్లకే సరిపోయింది. అతని కల కలగానే మిగిలిపోయింది. రిటైర్‌‌‌‌ అయ్యాక ఇంట్లో ఖాళీగా కూర్చోవడం వల్ల ఒంటరిగా ఫీల్‌‌ అయ్యారు ఈ జంట. అయితే, అప్పుడే సొంతంగా ఏదైనా స్టార్టప్‌‌ పెట్టాలి అనుకున్నారు. ‘అవిమీ’ అనే పేరుతో ఆయుర్వేద హెర్బల్‌‌ ప్రొడక్ట్స్‌‌ తయారుచేసి, వాటిని అమ్మడం మొదలుపెట్టారు.   

అలా మొదలైంది.. 

రాధాకృష్ణకు చిన్నప్పటి నుంచే ఆయుర్వేద వైద్యం మీద పట్టుంది. అప్పుడపుడు ఇంట్లో వాళ్లకు చిన్న చిన్న చిట్కాలు చెప్పేవారు. ఒక రోజు కూతురు జుట్టు బాగా రాలిపోతోందని చెప్పింది. వెంటనే రాధాకృష్ణ కొన్ని ఆకులు, మూలికలతో నూనె తయారుచేసి ఇచ్చారు. పదిరోజుల్లోనే ఆమెకు జుట్టు రాలడం తగ్గింది. నెల రోజులు వాడేసరికి జుట్టు ఒత్తుగా పెరిగింది. మరోసారేమో భార్య శకుంతలకు మోకాళ్ల నొప్పులు వచ్చాయి. తనకు కూడా మూలికలతో పెయిన్‌‌ కిల్లర్ తైలం తయారు చేసిచ్చారు రాధాకృష్ణ. అది కొన్ని రోజులు వాడేసరికి శకుంతలకున్న కీళ్ల నొప్పులన్నీ పోయాయి. ఇదంతా చూసి రాధాకృష్ణ  కూతుళ్లు ‘హెర్బల్‌‌ ఆయిల్ బిజినెస్‌‌ పెట్టొచ్చు కదా’ అని సలహా ఇచ్చారు. ఈ దంపతుల మనసులో ఉన్నది అదే కనుక 2021లో అవిమీ పేరుతో మార్కెట్‌‌లోకి ప్రొడక్ట్స్‌‌ లాంచ్‌‌ చేశారు. మొత్తం యాభైరకాల ఆకులు, మూలికల్ని ఈ ఆయిల్‌‌ ప్రొడక్ట్స్‌‌ తయారుచేయడానికి వాడతారు.

ఇంటి దగ్గరే దీనికి కావాల్సిన మెషిన్స్‌‌ పెట్టున్నారు. వర్కర్స్‌‌ని కూడా పెట్టుకున్నారు. హెయిర్‌‌‌‌ ఆయిల్‌‌, పెయిన్‌‌ కిల్లర్‌‌‌‌ ఆయిల్‌‌తో పాటు బ్యూటీ ప్రొడక్ట్స్‌‌ కూడా అమ్ముతున్నారు. ప్రొడక్ట్‌‌ మార్కెట్‌‌లో లాంచ్‌‌ చేసేముందు వాళ్లు ఒకసారి వాడిచూస్తారు. మంచి రిజల్ట్‌‌ ఉంటేనే మార్కెట్‌‌లోకి లాంచ్‌‌ చేస్తారు. అవిమీ ప్రొడక్ట్‌‌ మార్కెటింగ్‌‌ రాధాకృష్ణ కూతుళ్లు, మనవరాళ్లే చూసుకుంటారు. అకౌంట్స్‌‌ శకుంతల చూసుకుంటారు. అవిమీ ప్రొడక్ట్స్‌‌ని ఇన్‌‌స్టాగ్రామ్‌‌, అమెజాన్‌‌, ఫ్లిప్‌‌కార్ట్‌‌ల్లో అమ్ముతున్నారు. వీటి ధరలు నాలుగొందల రూపాయల నుంచి మొదలవుతాయి. అవి అమ్మగా వచ్చిన డబ్బుతో కొత్త కారు కొనుక్కొని తన కోరిక నెరవేర్చుకున్నాడు రాధాకృష్ణ. ఈ విషయమే ఇప్పుడు సోషల్‌‌ మీడియాలో వైరల్ అవుతోంది. రాధాకృష్ణ ఫ్యాక్టరీలో మెషిన్స్‌‌కు, కారుకు పూజ చేస్తున్న వీడియోను సోషల్‌‌ మీడియాలో 18.5 మిలియన్ల మంది చూశారు. 

‘నాతో చాలామంది ఓవర్‌‌‌‌ నైట్‌‌లో సక్సెస్‌‌ అయ్యావని అంటుంటారు. కానీ, నేను పరిపూర్ణంగా ఆనందం పొందింది మాత్రం ఈ స్టార్టప్‌‌ పెట్టిన తరువాతే. పాతికేండ్ల కష్టానికి వచ్చిన ప్రతిఫలం ఇది’ అంటున్నారు రాధాకృష్ణ.