Radhika: సినీ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం.. శోకసంద్రంలో కుటుంబం

Radhika: సినీ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం.. శోకసంద్రంలో కుటుంబం

చెన్నై: సీనియర్ సినీ నటి రాధికా శరత్ కుమార్ ఇంట్లో విషాద ఘటన జరిగింది. అనారోగ్య కారణాలతో రాధిక తల్లి గీత (86) ఆదివారం రాత్రి చనిపోయారు. కన్న తల్లి చనిపోవడంతో రాధిక తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. ఆమె లేని లోటును తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రాధిక ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రాధిక తల్లి వయసు మీద పడిన కారణంగా అనారోగ్య సమస్యలకు లోనయ్యారు. ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్లో ఉంచారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలోని బెసెంట్ నగర్లో గీత దహన సంస్కారాలు జరుగుతాయని రాధిక కుటుంబం తెలిపింది. రాధిక సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆమె తల్లికి తుది వీడ్కోలు పలికేందుకు తరలివెళ్లారు. రాధిక తల్లి గీత మృతిపై తమిళ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తల్లితో తన అనుబంధంపై, కన్న తల్లి తనకు మిగిల్చిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ రాధిక ఒక వీడియో షేర్ చేశారు.

రాధిక తండ్రి మద్రాస్ రాజగోపాలన్ రాధాకృష్ణన్ 1979లోనే చనిపోయారు. రాధిక తండ్రి కూడా ఒక నటుడే కావడం గమనార్హం. రాధిక తండ్రి మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు 12 మంది సంతానం. అందులో నలగురు కొడుకులు కాగా, ఎనిమిది మంది కూతుర్లు. రాధిక తండ్రికి గీత మూడో భార్య కావడం గమనార్హం. ఈ దంపతులకు రాధిక, నిరోషా సంతానం. ఈ ఇద్దరూ సినీ రంగంలో రాణించారు. 

రాధిక తల్లి గీత గృహిణిగా తెర వెనుకే ఉండిపోయారు. ఆమె భర్త సినిమా షూటింగ్స్ కారణంగా అందుబాటులో లేకపోయినా పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేసి బాధ్యతగా వ్యవహరించారు. భర్త సినీ రంగంలో సాధించిన విజయాలను, కూతురు సినీ రంగంలో ఎదిగిన తీరును కళ్లారా చూసి రాధిక తల్లి కాలం చేశారు.