Radhika Yadav: కూతురి సంపాదనతో బతకడానికి సిగ్గు లేదా అని.. సమాజం దెప్పిపొడిచినందుకు కూతురిని చంపేసిన తండ్రి !

Radhika Yadav: కూతురి సంపాదనతో బతకడానికి సిగ్గు లేదా అని.. సమాజం దెప్పిపొడిచినందుకు కూతురిని చంపేసిన తండ్రి !

గురుగ్రాంలో ఒక మాజీ జూనియర్ టెన్నిస్ క్రీడాకారిణి కన్న తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. గురుగ్రాంకు చెందిన రాధికా యాదవ్ అనే యువతిని ఆమె తండ్రి దీపక్ యాదవ్ తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గురుగ్రాంలోని సెక్టార్-57లో 25 ఏళ్ల వయసున్న రాధికా యాదవ్ అనే మాజీ జూనియర్ టెన్నిస్ క్రీడాకారిణి కుటుంబంతో కలిసి ఉంటోంది. ఆమె జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.

గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో రాధిక తన ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తుండగా ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఆమెపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలుసుకున్న రాధికా అంకుల్ కుల్దీప్ యాదవ్ ఆమెను హుటాహుటిన సెక్టార్ 56లోని ఏసియా మారింగో హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రీ కూతురి మధ్య కొన్నాళ్ల నుంచి రాధికా టెన్నిస్ అకాడమీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పైగా.. సొంతూరికి వెళ్లినప్పుడల్లా కూతురి సంపాదనతో బతకడానికి సిగ్గూశరం లేదా అని ఊరి జనం సూటిపోటి మాటలతో దెప్పి పొడిచారు. తన కూతురి క్యారెక్టర్ను కూడా తప్పుబట్టారు. ఈ పరిణామం కూడా కూతురిపై ద్వేషాన్ని మరింత పెంచాయి. 

ఈ క్రమంలోనే.. కూతురిపై పగతో రగిలిపోతున్న తండ్రి రాధికా యాదవ్ చేసిన మ్యూజిక్ వీడియో ఒకటి నెట్లో రావడం చూశాడు. ఆ వీడియోలో ఒక యువకుడి ప్రేమికురాలిగా రాధికా కనిపించింది. అసలు ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తున్నావని ఆమె తండ్రి నిలదీశాడు. ఈ విషయంలో తండ్రీకూతురి మధ్య గొడవ జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న దీపక్ యాదవ్ తన కూతురిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య ఇంట్లో లేని సమయం కోసం ఎదురుచూశాడు.

గురువారం ఉదయం తన భార్య బయటకు వెళ్లాక తన కూతురిని చంపడానికి ఇదే సరైన సమయం అని దీపక్ యాదవ్ భావించాడు. తన భార్య పుట్టినరోజు నాడే కూతురిని కాల్చి చంపేశాడు. ఈ ఘటన సోషల్ మీడియాతో పాటు ఇటు మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది. ఒక కన్న తండ్రి ఇంత దారుణంగా గుండెలపై ఎత్తుకుని పెంచిన కూతురిని ఎలా చంపాడని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. దీపక్ యాదవ్ బాగానే సంపాదించాడు. అతనిది ధనిక కుటుంబమే. రాధికా యాదవ్ ఒక టెన్నిస్ అకాడమీ కూడా నిర్వహిస్తుండటం గమనార్హం. దీపక్ యాదవ్కు విలాసవంతమైన విల్లా ఉంది. ఖరీదైన స్కోడా కారు ఉంది.