పాకిస్తాన్లో అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అవుతుందా..?: ‘X’లో గోల గోల.. ట్రెండింగ్లో radiation

పాకిస్తాన్లో అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అవుతుందా..?: ‘X’లో గోల గోల.. ట్రెండింగ్లో radiation

పాకిస్తాన్ దేశంలో 13 రోజుల్లో 5 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన తర్వాత.. ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ మొదలుపెట్టాక ఇలా జరిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ దేశంలో వరసగా వచ్చిన భూ ప్రకంపనలకు మరో కారణం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది.

ఇండియా దాడిలో పాకిస్తాన్ అణు కేంద్రాలు దెబ్బ తిన్నాయని.. అందులోని న్యూక్లియర్ రియాక్టర్లు దెబ్బతిన్నాయని.. అణు ఉత్ర్పేరకాలు లీక్ అవుతున్నట్లు Xలో పోస్టుల వేల సంఖ్యలో దర్శనం ఇస్తున్నాయి. Xలో రేడియేషన్ పేరుతో ట్రెండ్ కావటం.. ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.

రీనా యాదవ్ అనే ఓ ఎక్స్ హ్యాండ్లర్.. ఇలా రాసుకొచ్చారు. పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అయ్యింది.. స్థానికులు వాంతులు, తలనొప్పి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో బాధితులకు రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యం దాస్తుంది అంటూ రాసుకొచ్చారామె.

మరో ఎక్స్ హ్యాండర్ అభి అయితే.. ఇలా చెబుతున్నాడు. పాకిస్తాన్ దేశంలో అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అవుతుంది.. కైరానా హిల్స్ ప్రాంతంలోని పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్.. ఇండియా దాడిలో దెబ్బతిన్నది అంటూ రాసుకొచ్చాడు. దీనికి సాక్ష్యం ఇదిగో అంటూ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ పేరుతో రిలీజ్ అయిన నోట్ ను షేర్ చేశాడు.

ఈజిప్ట్కు చెందిన ఎయిర్ ఫోర్స్ విమానం మంగళవారం ఉదయం పాకిస్తాన్కు చేరుకుంది. బోరాన్-10 అనే ఐసోటోప్ను ఆ విమానంలో పాకిస్తాన్కు చేర్చినట్లు తెలిసింది. బోరాన్ అనే ఈ రసాయన పదార్థాన్ని అణు స్థావరాల్లో కెమికల్ రియాక్షన్స్ను నియంత్రించడానికి, పేలుళ్లను నిరోధించడానికి ఉపయోగిస్తుంటారు. 

అలాంటి.. రసాయన పదార్థం ఇప్పుడు పాకిస్తాన్కు అవసరం పడిందంటే నిజంగానే రేడియేషన్ లీక్ అయి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ మిలటరీ రేడియేషన్ లీక్ అయిన విషయాన్ని కప్పి పుచ్చుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పాకిస్తాన్లోని కైరానా హిల్స్ సమీపంలో ఉన్న అణు స్థావరంపై భారత వైమానిక దళం దాడి చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.