వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలోని బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో మరోసారి ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. గత శుక్రవారం నలుగురు సీనియర్ స్టూడెంట్స్ ఓ జూనియర్ స్టూడెంట్ను మానసికంగా వేధించి ఫోన్ గుంజుకున్న విషయం ఆలస్యంగా బయటపడింది. ఇటీవల కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ సీనియర్ స్టూడెంట్స్ జూనియర్‌లను బట్టలు విప్పించి మోకాళ్లపై కూర్చోబెట్టి ర్యాగింగ్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఆ ఘటన మరవకముందే బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో మరో ఘటన జరగడం చర్చనీయాంశమైంది. విద్యార్థుల కథనం ప్రకారం.. నర్సింగ్ విద్యార్థులు ప్రయాణించే బస్సుకు డీజిల్ ఖర్చులు లేకపోవడంతో ప్రతి విద్యార్థి వద్ద డబ్బులు వసూలు చేసి బస్సు డీజిల్, నిర్వహణ ఖర్చులు భరిస్తున్నారు. ఈ క్రమంలో ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ చదువుతున్న ఓ విద్యార్థి ఫోర్త్ సెమ్ విద్యార్థులకు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని చెప్పడంతో వివాదం చెలరేగింది.
జూనియర్ తమకు చెప్పడం ఏంటని సీనియర్లు సీరియస్ అయ్యారు. హాస్టల్ వద్ద జూనియర్ స్టూడెంట్ను చుట్టుముట్టి దురుసుగా ప్రవర్తిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడి ఫోన్ గుంజుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ సునీతకు ఫిర్యాదు చేయగా అధికారులు లైట్ తీసుకున్నట్లు సమాచారం. దీంతో సెంట్రల్ యాంటీ ర్యాగింగ్ కమిటీకి కంప్లయింట్ ఇచ్చినట్లు సమాచారం.
పనిష్మెంట్ ఇచ్చిన అధికారులు..
సెంట్రల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ నుంచి సమాచారం అందుకున్న కాలేజీ అధికారులు బాధిత విద్యార్థిని, ర్యాగింగ్ పాల్పడిని విద్యార్థినులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితురాలికి క్షమాపణ చెప్పించారు. ముగ్గురు విద్యార్థినుల ప్రాక్టీస్‌ను వేరే హాస్పిటళ్లకు మార్చుతూ శిక్ష వేశారు. ర్యాగింగ్ విషయం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు తెలియడంతో హైదరాబాద్‌కు వచ్చి పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించినట్లు సమాచారం.
