తమిళనాడులో ఊహించని ట్విస్ట్.. విజయ్ పార్టీ అభ్యర్థిగా రాఘవ లారెన్స్..?

తమిళనాడులో ఊహించని ట్విస్ట్.. విజయ్ పార్టీ అభ్యర్థిగా రాఘవ లారెన్స్..?

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో విజయ్ టీవీకే పార్టీ తరపున నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు.. రాఘవ లారెన్స్ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉందని తమిళ మీడియా కోడై కూస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పోటీ చేసి గెలిచిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుచ్చి ఈస్ట్ ఒకటి.

ఈ నియోజకవర్గం నుంచి సీఎం విజయ్ ఇప్పటికే రాజీనామా చేశారు. దీంతో.. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక జరగనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తమిళనాడులోని కీలక నియోజకవర్గాల్లో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు టీవీకే జనంలో మంచి పేరు ఉన్న వ్యక్తుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిసింది.

సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న రాఘవా లారెన్స్ వైపు టీవీకే ఆశగా చూస్తోంది. ఈ క్రమంలోనే.. తిరుచ్చి తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా రాఘవ లారెన్స్ను బరిలో నిలిపితే పార్టీ మరింత బలపడుతుందని టీవీకే భావిస్తున్నట్లు సమాచారం. త్రిష ఈ స్థానం నుంచి పోటీ చేస్తుందని ప్రచారం జరిగినప్పటికీ అవన్నీ పుకార్లేనని తేలిపోయాయి. త్రిష ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోవచ్చని తెలిసింది.

విజయ్ టీవీకే పార్టీకి రాఘవ లారెన్స్ వ్యతిరేకి కాకపోవడం టీవీకే వ్యూహానికి మరింత కలిసొచ్చే అంశం. విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన సమయంలో రాఘవ లారెన్స్ టీవీకే విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ కూడా పెట్టారు.

ఇదిలా ఉండగా.. రాఘవ లారెన్స్ కూడా తన రాజకీయ రంగ ప్రవేశంపై తన గురువు రజనీకాంత్ సలహా తీసుకున్నట్లు తెలిసింది. లారెన్స్ నిర్ణయం దాని ఆధారంగానే ఉంటుందని భావిస్తున్నారు. టీవీకే పార్టీ నుంచి తిరుచ్చి తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం వస్తే.. రాఘవ లారెన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.