Raghava Lawrence: ప్రతిభకు ప్రశంస చిహ్నంగా.. లారెన్స్‌ నోట్ల వర్షం.. లారెన్స్ ఎమోషనల్ పోస్ట్

Raghava Lawrence: ప్రతిభకు ప్రశంస చిహ్నంగా.. లారెన్స్‌ నోట్ల వర్షం.. లారెన్స్ ఎమోషనల్ పోస్ట్

రాఘవ లారెన్స్ (Raghava Lawrence).. ఈ పేరు ప్రతిఒక్కరికీ ఎంతో ప్రత్యేకం. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే లారెన్స్కు తెలుగు, తమిళంలోనే కాదు.. ప్రతిచోటా మంచి పేరుంది. ఆయన సినిమాలు రిలీజైతే ఫ్యాన్స్కి పండగే. ఏ హీరోకు చేయని వేడుకలు చేస్తారు. అలా కొరియోగ్రాఫర్‌గా, హీరోగా రాణిస్తూ.. ‘రాఘవ లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ ద్వారా తనవంతు సాయం చేస్తూ మంచి మనసుచాటుతూ వస్తున్నారు. అంతేకాకుండా, ఎవరైనా తమ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసం కష్ట పడుతుంటే, బాసటగా నిలుస్తూనే వారిని నలుగురు ప్రోత్సహించాలని కోరుతున్నారు.

లేటెస్ట్గా దివ్యాంగులైనా కొంతమంది యువకులను పిలిచి తనదైన శైలిలో వారిని గౌరవించారు. వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ, ప్రతిఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈ మేరకు లారెన్స్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఫోటో పంచుకున్నారు. 

‘అందరికీ నమస్కారం.. నేను ఇప్పటివరకు నా దివ్యాంగుల అబ్బాయిలతో పంచుకున్న అద్భుతమైన ప్రయాణం మీ అందరికీ తెలుసు. నేను డ్యాన్సర్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రేక్షకులు నా దగ్గరి వచ్చి రూ.1 కాగితాలను నా షర్ట్కు గుచ్చేవారు. పూల దండలు వేసేవారు. ఆ ప్రోత్సాహం నాకెంతో సంతోషంగా ఉండేది. ఇది నా ప్రతిభకు వారిచ్చిన గొప్ప చిహ్నంగా భావించేవాడ్ని. అలాంటి ఆనందాన్నే నా బాయ్స్‌కు కూడా ఇవ్వాలనుకున్నా. వాళ్లను ఆశ్చర్య పరచాలనుకున్నా.

ఈ క్రమంలో నేను వారి ప్రతిభకు ప్రశంస చిహ్నంగా మాత్రమే కాకుండా, వారిని ప్రోత్సహించడానికి నోట్ల జల్లు కురిపించాను. కనుక, మీ ఈవెంట్‌లు లేదా ఫంక్షన్లలో వారు ప్రదర్శన ఇచ్చేలా ప్రోత్సహించండి. వారి ప్రదర్శన ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. అలాగే, సంతోషాన్నీ కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ బాయ్స్కి నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని’ లారెన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పోస్టుకి #Serviceisgod #maatram అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు లారెన్స్. 

రాఘవ లారెన్స్.. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో 'కాల భైరవ' మూవీ చేస్తున్నారు. లారెన్స్‌‌‌‌కి ఇది 25 సినిమా. ఎ స్టూడియోస్‌‌‌‌ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌పి, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌‌‌‌ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌‌‌‌పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే, బెంజ్, కాంచన 4లో హీరోగా నటిస్తున్నారు.