ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ గొంతుకనవుతా : రఘునందన్ రావు 

ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ గొంతుకనవుతా : రఘునందన్ రావు 

మెదక్ (చేగుంట), వెలుగు:  తనను ఆదరించి మెదక్ ఎంపీగా గెలిపిస్తే తెలంగాణ ప్రజల గొంతుకనవుతానని మెదక్ లోక్​సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గురువారం చేగుంట మండలం పొలంపల్లికి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యేగా మూడేళ్ల పాటు పనిచేసిన తాను దుబ్బాక పేరును అసెంబ్లీలో మారుమోగించానన్నారు. ఇప్పుడు ఎంపీగా గెలిపిస్తే ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తా అన్నారు. 1999 లో మెదక్ నుంచి ఆలే నరేంద్ర బీజేపీ తరపున పోటీ చేసి లోక్ సభకు ఎన్నికైనట్లు రఘునందన్ రావు గుర్తు చేశారు.

నరేంద్ర తర్వాత  మళ్లీ ఇక్కడ బీజేపీ జెండాఎగరకపోవడం బాధాకరమన్నారు. నరేంద్ర మోదీని మూడోసారి  ప్రధానమంత్రిగా చూడాలనే  కోరిక ప్రజల్లో బలంగా ఉందన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు బీజేపీని గెలిపించి ఈ స్థానాన్ని మోదీకి  కానుకగా ఇవ్వాలని కోరారు. రఘునందన్ రావు బాగుండాలని కోరుకునే ప్రజలు, వివిధ పార్టీల్లో ఉన్న మిత్రులు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తనపై నమ్మకంతో మెదక్ టిక్కెట్ ఇచ్చిన కేంద్ర , రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.