నేను అట్ల అనలేదు: ఎమ్మెల్యే రఘునందన్ ​రావు

నేను అట్ల అనలేదు: ఎమ్మెల్యే రఘునందన్ ​రావు

న్యూఢిల్లీ, వెలుగు: తాను అనని మాటలు అన్నట్లు  మీడియాలో ప్రచారం అవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ​రావు అన్నారు. పార్టీని ధిక్కరించినట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సోమవారం ఢిల్లీలో ఆయన క్లారిటీ ఇచ్చారు. పదేండ్లుగా క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా పని చేస్తున్నానని చెప్పారు. అనుక్షణం రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని తపించే వ్యక్తినని చెప్పారు. పార్టీ ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని చేస్తానని తెలిపారు. ఒకవేళ కీలక పదవులు అప్పగిస్తామని పిలిచి అడిగితే.. వారికే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. 

‘చిట్ చాట్ పేరుతో నేను అనని మాటల్ని అన్నట్లుగా, పార్టీ హైకమాండ్​ను ధిక్కరించినట్లు ప్రసారం చేశారు. జేపీ నడ్డా, అమిత్​ షాను విమర్శించినట్లు కథనాలు ప్లే చేసి నట్లు తెలిసింది. అనధికారికంగా, అధికారికంగా ఎప్పుడూ పార్టీ శ్రేయస్సు కోసమే పని చేస్తా. వ్యక్తిగత స్వార్థం కోసం పని చేయను’ అని చెప్పారు. పార్టీలో పని చేసే క్రమంలో పదవులు కావాలని ఆశిస్తామని స్పష్టం చేశారు. బీజేపీలో పదవులు ఇవ్వక పోయినా.. సామాన్య కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పని చేస్తానన్నారు. రెండో సారి తాను బీజేపీ గుర్తుపై గెలుస్తానన్నారు. కమలం గుర్తు, రఘునందన్ రావు వేరు వేరు కాదన్నారు. రఘునందన్ రావు ముఖం చూసి, బీజేపీ గుర్తు చూసి ప్రజలు గెలిపించారని చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్పు విషయంలో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.