సామాజిక న్యాయానికి టీఆర్ఎస్ వ్యతిరేకం

సామాజిక న్యాయానికి టీఆర్ఎస్ వ్యతిరేకం

నర్సంపేట, వెలుగు: నర్సంపేట నియోజకవర్గంలో వెయ్యి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తానన్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఈ మూడేండ్లలో ఎందుకు కట్టించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. నర్సంపేటలో కట్టే 250 బెడ్ల ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.60 కోట్లు ఇచ్చిందని తెలిపారు. బుధవారం నర్సంపేట పట్టణంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్​కేబినెట్​లో 18 మంది మంత్రులుంటే అందులో అగ్రవర్ణాలకే పది మందికి పదవులు ఇచ్చారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. అవకాశం వస్తే ఓసారి దళితుడ్ని, తాజాగా గిరిజన మహిళను రాష్ర్టపతిగా చేసిన ఘనత నరేంద్రమోడీ ప్రభుత్వానిదేనన్నారు.

బీసీ నేత ఈటల రాజేందర్ రాజకీయంగా ఎదుగుతున్నారనే ఉద్దేశంతోనే మంత్రి వర్గం నుంచి ఆయనను బర్తరఫ్ చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా రెండు వీడియోలు పెట్టించారని, తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ముకు ఎమ్మెల్యేకు కాదు కదా కేసీఆర్ కు కూడా లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్​రెడ్డి, కొండేటి శ్రీధర్, బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షుడు జాటోతు హుస్సేన్​నాయక్, లీడర్లు ఎడ్ల అశోక్​రెడ్డి, గటిక అజయ్​కుమార్ తదితరులున్నారు.