దేశంలోని 60శాతం ప్రజలు ఇండియా కూటమి వైపే: రాహుల్

దేశంలోని 60శాతం ప్రజలు ఇండియా కూటమి వైపే: రాహుల్
  • బీజేపీ కంటే ఎక్కువ ఆదరిస్తున్నరు: రాహుల్
  • మిజోరంలో అధికారం మాదే..
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వేరు అని విమర్శ

ఐజ్వాల్/లంగ్‌‌లై: దేశంలోని 60 శాతం ప్రజలకు.. ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి ప్రాతినిథ్యం వహిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇది బీజేపీ కంటే ఎక్కువే అని తెలి పారు. మిజోరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం ఐజ్వాల్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్​ గాంధీ మాట్లాడారు. మిజోరంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.2వేల పెన్షన్​తో పాటు 750 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. 

మతాలు, సంస్కృతులతో సంబంధం లేకుండా ప్రజల స్వేచ్ఛ, సామరస్యం, రాజ్యాంగ విలువలను ‘ఇండియా’ కూటమి కాపాడుతున్నదన్నారు. కూటమితో పోల్చుకుంటే.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆలోచనా విధానాలు వేరు అని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో హింస చెలరేగుతున్నా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశం పట్ల బీజేపీ దృష్టి వేరుగా ఉందని విమర్శించారు. 

ప్రజల మధ్యలో తాము నిర్ణయాలు తీసుకుంటే.. బీజేపీ మాత్రం ఢిల్లీలో డిసైడ్ అవుతుందని ఎద్దేవా చేశారు. మిజోరాం ప్రజలు తమ స్వేచ్ఛ, విశ్వాసాలు, సంప్రదాయాలు, భవిష్యత్తు కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మిజోరాంపై పట్టు సాధించేందుకు బీజేపీ ఇక్కడి ఎంఎన్ఎఫ్, జెడ్‌‌పీఎంలను ఉపయోగించుకుంటున్నదని అన్నారు. 

మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్​గఢ్​తో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్​లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు. పోయిన సారి రాజస్థాన్​లో బీజేపీని ఓడించామని, ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పారు. చత్తీస్​గఢ్​లో బీజేపీని తుడిచిపెట్టేశామని, మళ్లీ ఓడిస్తామని తెలిపారు. ఈ క్రమలో రాహుల్​ ఐజ్వాల్​ క్లబ్​కు కార్యకర్త స్కూటీపై వెళ్లారు.

అక్కడ పార్టీ నేతలతో సమావేశం అయ్యేందుకు బయలుదేరిన రాహుల్​.. ఒక స్కూటీ పై హెల్మెట్​ పెట్టుకుని వెనుకాల కూర్చొన్నారు. ఈ ఫొటో ఐజ్వాల్​ కాంగ్రెస్ లీడర్లు ట్విట్టర్​లో పోస్టు చేయడంతో వైరల్​ అవుతున్నది.