- పుతిన్ పర్యటన వేళ కేంద్రంపై ప్రతిపక్ష నేత విమర్శలు
న్యూఢిల్లీ: తనను విదేశీ ప్రముఖు కలవకుండా కేంద్రం అడ్డుపడుతున్నదని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదీ మోదీ ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనమని విమర్శించారు. గురువారం ఆయన పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
" సాధారణంగా మన దేశ సంప్రదాయం ఏంటంటే..విదేశాల నుంచి వచ్చే అతిథులు ప్రతిపక్ష నేతను కలుస్తారు. దానికి కేంద్రం సహకరిస్తుంది. వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో ఈ సంప్రదాయం కొనసాగింది. కానీ ఇప్పుడు ఏమవుతోందంటే.. విదేశీ అతిథులు మన దేశానికి వచ్చినప్పుడు లేదా నేను విదేశాలకు వెళ్లినప్పుడు నన్ను కలవకూడదని వాళ్లకు మన మోదీ ప్రభుత్వమే సూచిస్తున్నది.
ఇది ఎన్డీయే పాలసీ. ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది. మిమ్మల్ని కలవొద్దని మీ ప్రభుత్వం నుంచి మాకు మెసేజ్ వచ్చిందని విదేశీ అతిథులే చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే భారత్ కాదు. ప్రతిపక్షం కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ మోదీజీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ" అని రాహుల్ విమర్శించారు.
ప్రొటోకాల్ పాటిస్తలేరు: ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.."ఎన్డీయే ప్రభుత్వం అన్ని విషయాల్లో ఒకే విధానాన్ని అమలు చేస్తున్నది. ప్రతి ప్రజాస్వామ్యంలో ఒక ప్రొటోకాల్ ఉంటుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక స్వరాలు వినిపించకుండా చేస్తున్నారు. అలాగే..విదేశీ అతిథులు వచ్చినప్పుడు ఎల్వోపీని కలవ కుండా చేసి ప్రొటోకాల్ బ్రేక్ చేస్తున్నారు" అని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కే.సీ. వేణుగోపాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "విదేశీ అతిథులతో ఎల్వోపీ కలవడం ప్రజాస్వామ్య సంప్రదాయం. దీనివల్ల భారత్ అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం అవుతాయి. కానీ 'మన్ కీ బాత్' మాత్రమే మాట్లాడాలనుకునేవాళ్లకు వీటి పట్ల గౌరవం ఉండదు" అని విమర్శించారు.
