ఇయ్యాల్టి నుంచి తెలంగాణలో రాహుల్​ పాదయాత్ర

ఇయ్యాల్టి నుంచి తెలంగాణలో రాహుల్​ పాదయాత్ర
  • కృష్ణానది మీదుగా మక్తల్‌‌లోకి ప్రవేశం
  • ఉదయం పాదయాత్ర.. ఆ తర్వాత ఢిల్లీకి
  • మూడు రోజులు బ్రేక్.. తిరిగి 27న ప్రారంభం
  • 31న హైదరాబాద్​ కు.. రాష్ట్రంలో 12 రోజుల యాత్ర

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. కర్నాటకలోని రాయచూర్ నుంచి కృష్ణా నది మీదుగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి రాహుల్​ ఎంటర్​ అవుతారు. ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు రాహుల్​ పాదయాత్ర చేసి ఆ తర్వాత మూడు రోజులపాటు విరామం తీసుకోనున్నారు. 

దీపావళి పండుగ, 26న ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు ఆయన 24 నుంచి 26 వరకు యాత్రకు బ్రేక్ ఇస్తున్నారు. మక్తల్‌‌‌‌‌‌‌‌లో ఉదయం పాదయాత్ర తర్వాత రాహుల్ ఢిల్లీకి వెళ్తారు. 27న యాత్రను తిరిగి పాదయాత్ర మొదలుపెడతారు. రాష్ట్రంలో రాహుల్ యాత్ర 12 రోజుల పాటు సాగనుంది. 31న శంషాబాద్ మీదుగా హైదరాబాద్​లోకి ప్రవేశిస్తుంది. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్​లో యాత్ర చేసి కూకట్​పల్లి, బీహెచ్ఈఎల్ మీదుగా సంగారెడ్డికి వెళ్తారు. నవంబర్​ 7న కామారెడ్డిలోని మద్నూర్ నుంచి భారత్​జోడో యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో ఆయన 366 కిలోమీటర్ల యాత్ర చేస్తారు.

మారిన రాహుల్ ఇమేజ్: బెల్లయ్య నాయక్

భారత్​ జోడో యాత్ర ముందుకు సాగుతున్న కొద్ది జనంలో రాహుల్ ఇమేజ్ మారుతోందని రాష్ట్రం నుంచి భారత్​ జోడో యాత్రీగా ఎంపికై ఆయనతోపాటు యాత్ర చేస్తున్న బెల్లయ్య నాయక్ అన్నారు. మొదటి పది రోజుల్లోనే రాహుల్ వ్యక్తిత్వం విషయంలో ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయని, ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా, స్పష్టమైన సమాధానాలు చెప్పడమే దానికి కారణమని తెలిపారు. రాహుల్​పై సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాలు చేసే బీజేపీ ఇప్పుడు సైలెంట్ అయ్యిందని, ఎన్నడూ లేని విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా మసీదుల వెంట పరిగెడుతున్నారని బెల్లయ్య నాయక్ అన్నారు. ‘‘రాహుల్ స్పీడ్​ను మేం చాలా సందర్భాల్లో అందుకోలేకపోతున్నాం. ఆయన ఫిట్​నెస్ సూపర్. ఆయన పప్పు కాదు. స్ట్రాంగ్ మ్యాన్”అని చెప్పారు. బెల్లయ్య నాయక్ యాత్ర మొదటి రోజు నుంచి చివరి దాకా ఉంటారు.

కంటెయినర్లలో నిద్ర, యాత్రీలతో కలిసి నడక..

రాహుల్ సుదీర్ఘ యాత్ర కోసం కాంగ్రెస్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. స్థానిక ప్రజలు, నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్ర పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాహుల్ యాత్రలో ఆయన వెంట నడిచేందుకు నెల రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించి 120 మంది యాత్రీలను నియమించామని కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తెలిపారు. భారత్ జోడో యాత్రీలతోపాటు పీసీసీలు ఎంపిక చేసే రాష్ట్ర యాత్రీలు, యాత్రకు సంఘీభావం తెలిపే ప్రజా సంఘాల యాత్రీలు, ఆ రోజు తాత్కాలికంగా యాత్ర చేసే నాలుగు రకాల యాత్రీలతో పాదయాత్ర సాగుతోందని తెలిపారు. ప్రతి రోజు ఆయన యాత్రలో 50 వేల మందికి తగ్గకుండా ఉంటున్నారన్నారు. మారుమూల ప్రాంతాల్లో యాత్ర సమయంలో కూడా మూడు నుంచి ఐదు వేల మంది ఉంటున్నారని బెల్లయ్య నాయక్ చెప్పారు.

తెలంగాణలో గేమ్ చేంజర్​: వంశీచంద్ రెడ్డి

రాహుల్ యాత్ర ద్వారా రాష్ట్రంలో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలనే ఉద్దేశంతో పీసీసీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలో రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. శంషాబాద్ నుంచి చార్మినార్, అక్కడి నుంచి గాంధీభవన్ మీదుగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరా విగ్రహం వరకు సాగుతుంది. అక్కడి నుంచి పంజాగుట్ట, సనత్​నగర్, కూకట్​పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్​చెరు మీదుగా సంగారెడ్డికి వెళ్తుంది. హైదరాబాద్​లో యాత్ర సాగుతున్న సమయంలో రికార్డు స్థాయిలో జనం ఉండేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

చార్మినార్ మీదుగా సాగే యాత్ర వందేండ్ల రాజకీయ చరిత్రలోనే రికార్డుగా మిగిలిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నేతగా రాహుల్ రాష్ట్రంలో ప్రవేశించినపుడు అద్భుతమైన స్పందన లభిస్తుందని నేతలు ఆశిస్తున్నారు. ‘‘కాంగ్రెస్​కు ప్రతికూలమైన పరిస్థితి ఉంటుందనుకున్న ఏపీలో యాత్రకు మేం ఊహించనంత స్పందన వచ్చింది. తెలంగాణలో యాత్ర అనూహ్యమైన రీతిలో సాగుతుందనే నమ్మకం మాకు ఏర్పడింది. తప్పకుండా రాహుల్ తెలంగాణ యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతుంది’’అని వంశీచంద్ రెడ్డి చెప్పారు.

మహా యాత్ర..

దేశ ప్రజలందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,570 కి.మీ భారత్​ జోడో యాత్రను రాహుల్​ తలపెట్టారు. మొత్తంగా 150 రోజుల పాటు రాహుల్​ పాదయాత్ర చేయనున్నారు. ప్రతి రోజు 22 నుంచి 23 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 దాకా 15 కిలోమీటర్లు, సాయంత్రం 4 తర్వాత మరో 10‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 12 కిలోమీటర్లు యాత్ర చేస్తున్నారు. యాత్ర సమయంలో రాహుల్ వివిధ వర్గాలతో మాట్లాడుతున్నారు. సాయంత్రం కార్నర్ మీటింగ్స్​లో ప్రజలతో సంభాషిస్తున్నారు. సెప్టెంబర్ 7న మొదలైన యాత్ర 12 రాష్ట్రాల మీదుగా సాగుతోంది. రాహుల్ ఇప్పటి వరకు 1,200 కిలోమీటర్లకుపైగా యాత్ర పూర్తి చేశారు.