టీఆర్ఎస్, బీజేపీలు వ్యాపార సంస్థలుగా మారాయి: రాహుల్ గాంధీ

టీఆర్ఎస్, బీజేపీలు వ్యాపార సంస్థలుగా మారాయి: రాహుల్ గాంధీ

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజకీయాలను ధన ప్రమేయం చేశాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నారాయణపేట్ జిల్లాలోని మక్తల్ నుంచి మరికల్ వరకు కొనసాగింది. ఈ యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా తరలించారు. ఈ సందర్భంగా జోడో యాత్రకు రోజురోజుకి మద్దతు పెరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని ఆయన ఆరోపించారు. మియాపూర్ స్కాం, కాళేశ్వరం ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వ్యాపార సంస్థలుగా కొనసాగుతున్నాయని రాహుల్ వ్యాఖ్యానించారు.

దేశంలో నిరుద్యోగ సమస్య

మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ, నల్ల చట్టాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాహుల్ అన్నారు. మోడీ ప్రభుత్వం కారణంగా దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరుగుతోందని ఆవేదన చెందారు. పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు ప్రజలకు భారంగా మారాయని కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసమే భారత్ జోడో యాత్ర చేస్తు్న్నామని చెప్పారు. 3వేల 500 కిలో మీటర్లు నడవటం అంత ఆషామాషీ విషయం కాదన్నారు. మీ శక్తిని ధారపోసి నాతో అడుగేస్తుంటే..  కష్టం తెలియటం లేదని చెప్పిన ఆయన జోడో యాత్రకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.