దమ్ముంటే ట్రంప్ చెప్పేది నిజం కాదని చెప్పండి: ప్రధాని మోడీకి రాహుల్ సవాల్

దమ్ముంటే ట్రంప్ చెప్పేది నిజం కాదని చెప్పండి: ప్రధాని మోడీకి రాహుల్ సవాల్

పాట్నా: ప్రధాని మోడీకి కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం (అక్టోబర్ 30) నలందలో రాహుల్ గాంధీ క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ఇండియా, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. ఇది నిజం కాకపోతే ట్రంప్ అబద్ధం చెబుతున్నారని ప్రధాని మోడీ చెప్పాలి. మోడీకి నిజంగా ధైర్యం ఉంటే ఈ పని చేయాలి’’ అని సవాల్ విసిరారు రాహుల్ గాంధీ. 

బీహార్‌లో జరిగే ఏ సమావేశంలోనైనా మోడీ ఈ విషయం చెప్పొచ్చన్నారు. కానీ మోడీ ఈ పని చేయరని.. ఎందుకంటే ట్రంప్ ముందు ఆయన నిలబడలేరని అన్నారు. ట్రంప్‌ను ఎదుర్కొనే ధైర్యం మోడీకి లేదన్నారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ అమెరికాకు భయపడలేదని, తలవంచలేదని గుర్తు చేశారు.

ఇండియాను బయపెట్టేందుకు అమెరికా నౌవికాదళాన్ని పంపినా కూడా ఇందిరా జనకలేదని.. మీరు చేసేది మీరు చేయండి.. మేం చేసేది మేం చేస్తామని అమెరికాకు తేల్చిచెప్పారని గుర్తు చేశారు. అమెరికా విషయంలో ఒక మహిళకు ఉన్న ధైర్యం కూడా మోడీకి లేదని.. ఆయనొక పిరికివాడని విమర్శించారు.  ట్రంప్‌ను ఎదుర్కొనే దార్శనికత, ధైర్యం రెండూ మోడీకి లేవని ఆరోపించారు. 

►ALSO READ | వివాదంలో కాష్ పటేల్.. స్నేహితురాలి మ్యూజిక్ కన్సర్ట్‎కు ప్రభుత్వ జెట్‎లో ప్రయాణం

మోడీ చేతిలో నితీష్ కుమార్ రిమోట్ కంట్రోల్:

బీహార్ సీఎం నితీష్ పైన రాహుల్ ఫైర్ అయ్యారు. బీహార్‌ను మార్చానని నితీష్ కుమార్ చెప్పుకుంటున్నారు.. కానీ నేడు రాష్ట్రం పేపర్ లీకేజీలు, పేలవమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలకు పర్యాయపదంగా మారిందని విమర్శలు గుప్పించారు. బీహార్‌ ప్రజలు ఇప్పటికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరంగా ఉన్నారని అన్నారు. 

ఢిల్లీ ఎయిమ్స్ దగ్గర బీహార్ రోగుల క్యూ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇక్కడి వరకు ఎందుకు వస్తారని వాళ్లను అడిగితే.. -బీహార్ లో ఆసుపత్రికి వెళ్తే తిరిగిరామని.. అందుకే ట్రీట్మెంట్ కోసం ఇక్కడి వరకు వస్తున్నామని చెప్పారని అన్నారు. సీఎం నితీష్ రిమోట్ కంట్రోల్ ప్రధాని మోడీ చేతుల్లో ఉందని.. ప్రభుత్వాన్ని మోడీ, అమిత్ షానే నడుపుతున్నారని ఆరోపించారు.