వాషింగ్టన్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన స్నేహితురాలు, సింగర్ అలెక్సిస్ విల్కిన్స్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు హాజరయ్యేందుకు ఆయన ప్రభుత్వ విమానాన్ని ఉపయోగించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ కైల్ సెరాఫిన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పెన్సిల్వేనియా స్టేట్ నాష్‌విల్లేలో జరిగిన సింగర్ అలెక్సిస్ విల్కిన్స్ మ్యూజిక్ కన్సర్ట్కు హాజరు కావడానికి ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ 60 మిలియన్ డాలర్ల డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ జెట్ ఉపయోగించాడని ఆరోపించారు.
‘‘ఈ వ్యక్తి నాయకత్వం వహించే ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగులందరికీ షట్ డౌన్లో భాగంగా జీతాలు కూడా చెల్లించట్లేదు. కానీ ఆయనేమో 60 మిలియన్ డాలర్ల ప్రభుత్వ జెట్‌లో నాష్‌విల్లేలో తన స్నేహితురాలి మ్యూజిక్ కన్సర్ట్కు వెళ్తున్నాడు’’ అని సెరాఫిన్ ఆరోపణలు చేశారు. పటేల్ అక్కడికి వెళ్లే సమయానికి ఉత్తర వర్జీనియా విమానాశ్రయం నుంచి ప్రభుత్వ జెట్ బయలుదేరి క్యాంపస్ సమీపంలోని స్టేట్ కాలేజ్ పెన్సిల్వేనియా ప్రాంతీయ విమానాశ్రయంలో దిగిందని పేర్కొన్నాడు.
కాష్ పటేల్ ప్రయాణించిన జెట్ ఎఫ్ఏఏ ప్రభుత్వ యాజమాన్యంలో ఉందని తెలిపాడు. ఈ కార్యక్రమంలో కాష్ పటేల్ పాల్గొని తనతో కలిసి దిగిన ఫొటోలను సింగర్ విల్కిన్స్సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరింది. నిబంధనల ప్రకారం.. ఎఫ్‌బీఐ డైరెక్టర్లు ప్రభుత్వ విమానాలను తమ వ్యక్తిగత పర్యటనల కోసం ఉపయోగించరాదు. ఒకవేళ ఉపయోగిస్తే ప్రభుత్వానికి కమర్షియల్ కోచ్ టికెట్ ధర చెల్లించాలి.
ఎఫ్‌బీఐ డైరెక్టర్లు తమ వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రభుత్వ జెట్లను ఉపయోగించరాదని 2023లో కాష్ పటేల్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆవే ఆరోపణలు ఆయన ఎదుర్కొవడం గమనార్హం. అయితే.. కాష్ పటేల్ ఈ ఆరోపణలు ఎదుర్కొవడం ఇదే తొలిసారి కాదు. ప్రభుత్వ విమానంలో పటేల్ వ్యక్తిగత ప్రయాణాన్ని సమీక్షించాలని సెనేట్ డెమొక్రాట్లు గతంలో యూఎస్ ప్రభుత్వాన్ని కోరారు.
