మోదీజీ.. ఏటా 2 కోట్లఉద్యోగాలు ఎక్కడ

మోదీజీ.. ఏటా 2 కోట్లఉద్యోగాలు ఎక్కడ
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 లక్షల జాబ్స్: రాహుల్

న్యూఢిల్లీ: ఉద్యోగ కల్పనపై ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఆ పార్టీ సృష్టించిన భ్రమలలో నుంచి బయటపడి తమ తలరాతను తామే మార్చుకోవాలని యువతకు సూచించారు. ‘మోదీజీ.. ఉద్యోగ కల్పనపై మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా?’ అనే ప్రశ్న ఇప్పుడు యువత మనస్సులో ఉందన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలంటూ అబద్ధం ఎందుకు చెప్పారంటూ వాళ్లు బీజేపీ నేతలను నిలదీస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. అయితే, యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టతతో ఉందని, అధికారంలోకి రాగానే 30 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని చెప్పారు. ఏడాదికి రూ. లక్ష ఆదాయం వచ్చే ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. దేశ యువతను మభ్యపెట్టి, తప్పుదోవ పట్టించి తమ పబ్బం గడుపుకోవాలనేది బీజేపీ ఐడియాలజీ అని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం యువత భవిష్యత్తు నిర్మాణం గురించి ఆలోచిస్తుందని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు. రెండు పార్టీల ఐడియాలజీల మధ్య తేడాను గుర్తించి, ఓటు హక్కు ద్వారా తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని రాహుల్​ గాంధీ చెప్పారు.