మేమొచ్చాక దేశవ్యాప్తంగా కుల గణన: రాహుల్​

మేమొచ్చాక దేశవ్యాప్తంగా కుల గణన: రాహుల్​
  • కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానం

న్యూఢిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఆ పార్టీ ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కూడా వెంటనే అమలులోకి తెస్తామని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్​కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం తీర్మానం చేసింది. ఈ మీటింగ్​లో జరిగిన తీర్మానాలకు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలను పార్టీ మాజీ చీఫ్​రాహుల్​గాంధీ బయట మీడియా సమావేశంలో వెల్లడించారు.

కులగణనకు సంబంధించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వచ్చారని తెలిపారు. త్వరలోనే ఆయా రాష్ట్రాల్లో కులగణన చేపడతామని వివరించారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదని తెలిపారు. ఇది పేదరిక నిర్మూలనకు వేస్తున్న బలమైన ముందడుగని వివరించారు. 'ఇండియా' కూటమిలోని మెజారిటీ పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. కాగా, కుల గణన ఒక'ఎక్స్-రే' లాంటిదని..దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిన అంశాలను గుర్తించడానికి ఇది సాయపడుతుందని అన్నారు. 

కులాల వారీగా జనాభాను లెక్కిస్తే.. అది చాలా శక్తిమంతమైన నిర్ణయం అవుతుందని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో నిర్వహించిన కుల గణన వివరాలను త్వరలో  రిలీజ్ చేస్తామని  ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అన్నారు. .

మంచి వ్యూహంతో గెలవచ్చు: ఖర్గే

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో  విజయం సాధించేందుకు సమర్థవంతమైన వ్యూహం అవసరమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆయా రాష్ట్రాల్లో  పార్టీ గెలుపు కోసం కార్యకర్తలందరూ తమ శక్తియుక్తులతో పాటు సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో పని చేయాలని కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) సమావేశంలో  పార్టీ నేతలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించాలనే డిమాండ్‌‌‌‌‌‌‌‌ను ఆయన మరోసారి లేవనెత్తారు.