3 నెలల్లో బీజేపీకి కనువిప్పు : రాహుల్ గాంధీ

3 నెలల్లో బీజేపీకి కనువిప్పు : రాహుల్ గాంధీ

ఢిల్లీ : ఏఐసీసీ మైనారిటీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా ఉన్న భారత్ కు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అలాంటి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి అన్నింటినీ.. అందరినీ ఒక్కటి చేసేందుకు ప్రయత్నించాలన్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలను విభజించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను కాంగ్రెస్ ఓడించబోతోందని చెప్పారు రాహుల్ గాంధీ.

ఇండియాలో ఎంతటి వారైనా… ఏ ప్రభుత్వమైనా దేశం, ప్రజల తర్వాతనే అని చెప్పారు. కానీ.. దేశం కంటే తమ పార్టీనే ఉన్నతమైనదన్నట్టుగా బీజేపీ నేతలు భావిస్తున్నారనీ… వారికి దేశమే ముఖ్యమన్న సంగతిని జనం గుర్తుచేయాలన్నారు. 3 నెలల్లో బీజేపీకి కనువిప్పు కలిగించాలని కోరారు రాహుల్ గాంధీ. దేశంలోని వ్యవస్థలు ఏ పార్టీకి చెందినవి కావన్నారు. అవి దేశానికి చెందినవే అని చెప్పారు. అది కాంగ్రెస్ ఐనా.. బీజేపీ అయినా… వ్యవస్థలను నాశనం చేసేటప్పుడు .. వాటిని కాపాడే బాధ్యత ప్రజలు తీసుకోవాలన్నారు.