ప్రతి రంగంలోనూ మోదీ సర్కార్ గుత్తాధిపత్యం..చిన్న, మధ్య తరగతి వ్యాపారులను ఆగచేస్తోంది: రాహుల్ గాంధీ

ప్రతి రంగంలోనూ మోదీ సర్కార్ గుత్తాధిపత్యం..చిన్న, మధ్య తరగతి వ్యాపారులను ఆగచేస్తోంది: రాహుల్ గాంధీ
  • అన్నిటినీ మోదీ తన అనుచరులకు కట్టబెడ్తున్నరు
  • దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్​ సెక్టార్​ దెబ్బతింటున్నదని వ్యాఖ్య
  • జర్మనీలో బీఎండబ్ల్యూ ప్లాంట్​ విజిట్​

న్యూఢిల్లీ/మ్యూనిచ్​: కేంద్రంలోని మోదీ సర్కార్​ ప్రతి రంగంలోనూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నదని.. చిన్న, మధ్య తరగతి వ్యాపారులను పన్నులతో ఆగం చేస్తున్నదని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ మండిపడ్డారు. దేశానికి వెన్నెముక అయిన  ఎంఎస్​ఎంఈ(మైక్రో, స్మాల్​ అండ్​ మీడియం ఎంటర్​ప్రైజెస్) ఇండస్ట్రీలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నదని.. ఆయా ఇండస్ట్రీల్లో కూడా అనుచరులకు పెద్దపీట వేస్తున్నదని అన్నారు. 

ఢిల్లీలోని ఇండియా గేట్​ వద్ద  రోడ్డు పక్కన ఐస్​క్రీమ్​ బండ్లతో ఎంతో మంది పొట్టపోసుకునే వారని.. కానీ, ఇప్పుడు అవి కూడా కనిపించకుండా చిన్న ఐస్​క్రీమ్​ కంపెనీలపై మోదీ సర్కార్​ పన్నుల మోత మోగిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. దేశంలో మాన్యుఫాక్చరింగ్​ రంగం దెబ్బతింటున్నదని వ్యాఖ్యానించారు. జర్మనీ పర్యటనలో ఉన్న రాహుల్​ గాంధీ.. బుధవారం రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. 

ఇటీవల పార్లమెంట్​ ఆవరణలో తనను చిన్న, మధ్య తరగతి ఐస్​క్రీమ్​ కంపెనీల ప్రతినిధులు కలిశారని, వారి సమస్యలు చెప్పుకొని బాధపడ్డారని మొదటి వీడియోలో పేర్కొన్నారు. జర్మనీలోని మ్యూనిచ్​లో  బీఎండబ్ల్యూ ఆటోమొబైల్​ మాన్యుఫ్యాక్చరింగ్​ ప్లాంట్​ను సందర్శించిన విశేషాలతో మరో వీడియో రిలీజ్​ చేశారు.

చిన్న వ్యాపారులపై జీఎస్టీ దెబ్బ

చిన్న, మధ్యతరగతి వ్యాపారులు ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని.. అలాంటి వారిని మోదీ సర్కార్​ దెబ్బతీస్తున్నదని రాహుల్​ అన్నారు. అన్ని రంగాల్లో మోనోపలీ చెలరేగిపోతున్నదని, కావాల్సిన వాళ్లకు ప్రయోజనాలు చేకూరుస్తూ.. సామాన్యులను మోదీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

దెబ్బతింటున్న తయారీ రంగం

జర్మనీ పర్యటనలో ఉన్న రాహుల్​గాందీ.. అక్కడి మ్యూనిచ్​లోని బీఎండబ్ల్యూ ప్లాంట్​ను సందర్శించారు. కార్లను, బైక్​లను ఆసక్తిగా తిలకించారు. అందులో ఉంచిన టీవీఎస్​ 450 సీసీ మోటర్​ సైకిల్​ను చూసి ఫిదా అయ్యారు. భారత ఇంజనీరింగ్​ సహకారంతో బీఎండబ్ల్యూ ఇది రూపొందించడం.. ఇక్కడ భారత జెండా ఎగురుతుండడం ఆనందంగా ఉందని వీడియోలో రాహుల్​ పేర్కొన్నారు.  అదే సమయంలో.. భారత తయారీ రంగాన్ని  మోదీ సర్కార్​ పట్టించుకోవడంలేదని విమర్శించారు. 

రాహుల్​.. వాస్తవాలు తెలుసుకో: బీజేపీ

దేశంలో మాన్యుఫ్యాక్చరింగ్​ రంగం దెబ్బతింటున్నదన్న రాహుల్​గాంధీ కామెంట్లపై బీజేపీ మండిపడింది. విదేశాలకు వెళ్లిన ప్రతిసారి దేశం గురించి తప్పుగా మాట్లాడటం రాహుల్​కు అలవాటైందని విమర్శించింది. ‘‘ఫేక్​ న్యూస్​ ప్రచారం చేయడం రాహుల్​కు అలవాటైంది” అని  బీజేపీ అధికార ప్రతినిధి  ప్రదీప్​ బండారీ మండిపడ్డారు.  ‘‘పదేండ్లలో మన ఎలక్ట్రానిక్స్​ మాన్యుఫ్యాక్చరింగ్ రంగం 495 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. 

ఎగుమతుల్లోనూ 760 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. వాస్తవాలను, లెక్కలను తెలుసుకొని రాహుల్​ మాట్లాడాలి. 1991తో పోల్చుకుంటే ఇప్పుడు 14 రెట్లు గ్రోత్​తో ఇండియా దూసుకుపోతున్నది. 1991లో వెహికల్​ ప్రొడక్షన్​ యూనిట్స్​ 2 మిలియన్స్​ఉంటే..  2024 నాటికి అవి 28 మిలియన్స్​కు చేరాయి. 2047 నాటికి 200 మిలియన్స్​ వెహికల్స్​ను  ప్రొడ్యూస్​ చేయాలని భారత్​ లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో ఆటోమొబైల్​ రంగంలో మన దేశం టాప్​ 2 స్థానానికి చేరుతుంది.  ఈ విషయాన్ని రాహుల్​ గుర్తించాలి” అని ఆయన ‘ఎక్స్’​లో పోస్టు చేశారు.