పేదలకు 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్

పేదలకు 10 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్
  • చత్తీస్​గఢ్​లో రాహుల్​ గాంధీ హామీలు 
  • అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని వెల్లడి

రాయ్ పూర్: చత్తీస్‌‌‌‌గఢ్‌‌లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే పేద ప్రజలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమిలేని కూలీలకు ఏటా రూ.10 వేలు అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం రాహుల్​చత్తీస్​గఢ్​లో పర్యటించారు. రాజ్​నంద్​గాం ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశంలో కుల గణన నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, కూలీలతో మాట్లాడినప్పుడు తమకు ప్రస్తుతం రాజీవ్ గాంధీ భూమిహిన్ కిసాన్ న్యాయ్ యోజన కింద అందుతున్న రూ.7 వేలు సరిపోవడం లేదని చెప్పారని, అందుకే ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతామని చెప్పారు. పేదలు, కార్మికులు, రైతులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు, దళితుల కోసం కాంగ్రెస్ పనిచేస్తుండగా, కేంద్రం అదానీ వంటి బిలియనీర్ల కోసమే పనిచేస్తోందని రాహుల్​ విమర్శించారు. 

రైతులతో మాట్లాడిన రాహుల్​

చత్తీస్‌‌గఢ్ ప్రభుత్వ రైతు అనుకూల మోడల్ ​దేశమంతటా ప్రతిబింబిస్తుందని రాహుల్​గాంధీ అన్నారు. అంతకు ముందు ఆయన సీఎం భూపేశ్​ బాఘెల్, డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవూతో కలిసి రాయ్​పూర్​సమీపంలోని కతియా గ్రామాన్ని సందర్శించారు.  రైతులు, కూలీలతో మాట్లాడారు. కోతకు వచ్చిన వరి పంటకు కొబ్బరికాయ కొట్టారు. పర్యటన తర్వాత వరి పొలం వద్ద రైతులతో మాట్లాడిన ఫొటోలను ‘ఎక్స్’లో పోస్టూ చేస్తూ.. “రైతులు సంతోషంగా ఉంటే.. భారతదేశం సంతోషంగా ఉంటుంది. చత్తీస్‌‌గఢ్‌‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఐదు ఉత్తమ చర్యలు తీసుకున్నది. ధాన్యం మద్దతు ధర రూ.2,640 (క్వింటా), 26 లక్షల మంది రైతులకు రూ.23,000 కోట్ల ఇన్‌‌పుట్ సబ్సిడీ, 19 లక్షల మంది రైతులకు రూ. 10,000 కోట్ల రుణమాఫీ, విద్యుత్ బిల్లు సగం, 5 లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.7,000 ఇస్తున్నది. రైతు అనుకూల ఈ విధానం భారతదేశం అంతటా ఓ మోడల్​లో ప్రతిబింబిస్తుంది”అని రాశారు. “పేదలకు ప్రస్తుతం ఉన్న రూ. 5 లక్షల స్థానంలో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించబోతున్నం”అని ఆ రాష్ట్ర సీఎం భూపేశ్​ బాఘెల్ ‘ఎక్స్’ లో పోస్ట్​ చేశారు.