బీజేపీ, ఆరెస్సెస్​ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే : రాహుల్

బీజేపీ, ఆరెస్సెస్​ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే : రాహుల్
  • మణిపూర్‌‌కు మోదీ రాకపోవడం సిగ్గుచేటు
  • ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా?
  • ఈ రాష్ట్రం.. భారత్‌లో భాగం కాదని 
  • బీజేపీ, ఆర్‌‌ఎస్ఎస్‌ భావిస్తున్నాయేమో
  • బీజేపీ రాజకీయాలకు మణిపూర్ చాలా కోల్పోయింది..
  • శాంతి, సామరస్యాలను తిరిగి తీసుకొస్తామని హామీ
  • మణిపూర్‌‌ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షురూ
  • యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్​, సీతక్క, వివేక్, షర్మిల

న్యూఢిల్లీ: అల్లర్లతో సర్వస్వం కోల్పోయిన మణిపూర్‌‌ ప్రజలను పరామర్శించేం దుకు ఒక్కసారి కూడా ప్రధాని మోదీ రాలేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ రాజకీయాల కారణంగా మణిపూర్ ఎంతో కోల్పోయిం దని అన్నారు.

 ఆ పార్టీవి విద్వేష రాజకీయాలని ఆరోపించారు. మణిపూర్​ ప్రజల బాధను తాము అర్థం చేసుకున్నామని, శాంతి, సామరస్యాలను తిరిగి నెలకొల్పుతామని భరోసా ఇచ్చారు. ఆదివారం మణిపూర్‌‌లోని థౌబల్‌ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు రాహుల్​ శ్రీకారం చుట్టారు. థౌబల్‌లోని ఖోంగ్‌జోమ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో కలిసి జాతీయ జెండాను ఊపి తన యాత్రను రాహుల్​ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘గతేడాది జూన్ 29 తర్వాత మణిపూర్‌‌‌‌‌‌‌‌.. మణిపూర్‌‌‌‌‌‌‌‌లా లేదు. అది డివైడ్ అయింది. ప్రతిచోటా ద్వేషం వ్యాపించింది. లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు. తమకు కావాల్సిన వాళ్లను తమ కళ్ల ముందే కోల్పోయారు.

కానీ ఇప్పటిదాకా మీ కన్నీళ్లు తుడవడానికి, మీ చేయి పట్టుకోవడానికి, మిమ్మల్ని ఆలింగనం చేసుకునేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి రాలేదు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. బహుశా నరేంద్ర మోదీ, బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ దృష్టిలో మణిపూర్ అనేది భారతదేశంలో భాగం కాదేమో. మీ బాధ.. వారి బాధ కాదేమో’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విద్వేష రాజకీయాలు

బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు మణిపూర్ ఓ ఉదాహరణ అని రాహుల్ గాంధీ అన్నారు.  ఆ పార్టీ వల్ల మణిపూర్ విలువైన దాన్ని కోల్పోయిందని, మౌలిక సదుపాయాలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని విమర్శించారు. ‘‘2004 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. దేశంలో మొత్తం మౌలిక సదుపాయాలు కుప్పకూలిన ప్రదేశాన్ని మొదటిసారి చూస్తున్నా” అని చెప్పారు. మణిపూర్ ప్రజల బాధలను మేం అర్థం చేసుకున్నాం.. వారికైన గాయాలను, వారి దు:ఖాన్ని అర్థం చేసుకోగలం.

వారు విలువైనవి కోల్పోయారు. మేం వాటిని కనుగొని.. తీసుకొస్తాం. మాటిస్తున్నాం.. ఈ రాష్ట్రంలో ఇంతకుముందున్న సామరస్యాన్ని, శాంతిని, ఆప్యాయతను తిరిగి తెస్తం’’ అని భరోసానిచ్చారు. ‘‘మనం దేశంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటున్నాం. ఆర్థికంగా గుత్తాధిపత్యం ఏర్పడుతున్నది. దేశం సంపద మొత్తం కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నది. దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో పోరాడుతున్నది. ఈ అంశాలనే భారత్ జోడో న్యాయ్ యాత్రలో లేవనెత్తుతాం” అని వెల్లడించారు.

పొగమంచు వల్ల ఆలస్యం

షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కాస్త ఆలస్యంగా మొదలైంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా విమాన సర్వీసులు లేట్ కావడంతో మణిపూర్​కు రాహుల్ ఆలస్యంగా చేరుకున్నారు. ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌‌‌‌ గాంధీకి కాంగ్రెస్ సపోర్టర్లు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా థౌబల్‌‌‌‌ జిల్లాలోని ‘ఖోంగ్‌‌‌‌జోమ్‌‌‌‌ యుద్ధ స్మారకం’ వద్దకు వెళ్లారు.

1891 ఆంగ్లో- మణిపూర్ యుద్ధంలో అమరులైనవారికి నివాళులర్పించారు. తర్వాత ‘న్యాయ్‌‌‌‌ మైదాన్‌‌‌‌’కు చేరుకున్నారు. ఖర్గే, రాహుల్ గాంధీ కలిసి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. రాహుల్ గాంధీ ప్రయాణించే బస్సును ఖర్గే ఆవిష్కరించారు. తర్వాత బస్సులో రాహుల్ యాత్రగా బయల్దేరారు. వందలాది మంది ప్రజలు ఆయనకు స్వాగతం పలుకగా.. వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. తొలి దశలో జరిగిన ‘భారత్ జోడో యాత్ర’ పూర్తిగా పాదయాత్ర కాగా.. ‘న్యాయ్ యాత్ర’ మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని చెప్పారు.

ఇది సైద్ధాంతిక యాత్ర

రాహుల్ చేపట్టినది ఎన్నికల యాత్ర కాదని.. సైద్ధాంతిక యాత్ర అని కాంగ్రెస్ చెప్పింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పదేండ్ల అన్యాయ కాలానికి వ్యతిరేకంగా చేపట్టిందని పేర్కొంది. ‘‘పదేండ్ల ‘అన్యాయ్ కాల్‌‌‌‌’కు వ్యతిరేకంగా పోరాడేందుకు.. ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం కోసం గొంతు ఎత్తేందుకు చేపట్టిన యాత్ర ఇది. మణిపూర్‌‌‌‌లో హింస చెలరేగి 8 నెలలు దాటుతున్నా.. మణిపూర్‌‌‌‌‌‌‌‌పై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడ పర్యటించేందుకు ఆయన నిరాకరించారు. మణిపూర్‌‌‌‌ అనేది భారతదేశంలో భాగమని ప్రధాని భావించడం లేదా? దేశానికి మణిపూర్ ప్రజలు అందించిన సహకారాన్ని ప్రధాని గౌరవించడం లేదా?” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ప్రశ్నించారు.

67 రోజులు.. 6,713 కిలోమీటర్లు

2022 సెప్టెంబర్‌‌లో కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రను రాహుల్ చేపట్టారు. గతేడాది జవనరిలో కాశ్మీర్‌‌లో ముగించారు. ఇప్పుడు మణిపూర్ నుంచి ఆయన చేపట్టిన న్యాయ్ యాత్ర.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. 67 రోజుల్లో 6,713 కిలోమీటర్లు రాహుల్ పర్యటించనున్నారు. సుమారు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల పరిధిలో 100 లోక్‌సభ నియోజకవర్గాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు.

ఓట్లు అడిగేందుకే వస్తరు: ఖర్గే

మణిపూర్ ప్రజల ఓట్లను అడిగేందుకే ప్రధాని మోదీ వస్తారని, రాష్ట్ర ప్రజల బాధను పంచుకోవడానికి మాత్రం రారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. సముద్రంలో ఈత కొట్టేందుకు మోదీకి టైమ్ ఉంటుంది కానీ మణిపూర్‌‌కు వచ్చేందుకు ఉండదని విమర్శించారు. మతాన్ని, రాజకీయాలను కలిపి ప్రజలను బీజేపీ రెచ్చగొడుతున్నదని ఫైరయ్యారు. ‘‘సామాజిక న్యాయం, లౌకికవాదం,  సమానత్వానికి కాంగ్రెస్‌ అండగా నిలుస్తుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్ జోడో న్యాయ్ యాత్రను రాహుల్ చేపడుతున్నారు’’ అని చెప్పారు.