న్యూఢిల్లీ: బిహార్‌ను నితీశ్ కుమార్ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. విద్య, హెల్త్ కేర్‌తో పాటు అన్ని రంగాలనూ భ్రష్టు పట్టించిందని ‘జెన్ జడ్’ యూత్‌తో భేటీలో ఆయన ఫైర్ అయ్యారు. ఆ భేటీకి సంబంధించిన వీడియోను సోమవారం ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. జెన్ జడ్ యూత్‌తో ఆయన మాట్లాడుతూ.. నేటి యువత సత్యం, అహింసను నమ్ముతుందని, భారత్‌ను ఉజ్వల భవిత వైపు నడుపుతుందన్నారు.
‘‘భారత జెన్ జడ్‌పై నాకు నమ్మకం ఉంది. యువత రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నా. వారు పాలిటిక్స్‌లోకి ఎంటరైతే ఎక్సైటింగ్‌గా ఉంటుంది. దళిత్, ఆదివాసీ, ఈబీసీ, ముస్లిం.. ఎవరైనా సరే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అలాగే దేశ సంపద ఇద్దరు ముగ్గురు వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం కాకూడదు” అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా బిహార్ ఎన్నికల గురించి ఓ స్టూడెంట్ ప్రశ్నించగా.. బిహార్‌ను 20 ఏండ్లలో నితీశ్ సర్కారు నాశనం చేసిందని రాహుల్ మండిపడ్డారు. కాగా.. భేటీ అనంతరం యువతతో రాహుల్ సరదాగా ముచ్చటించారు. మిమ్మల్ని ఫన్నీగా ఏమని పిలవాలని ఓ యువతి అడగగా.. బ్రో అని పిలవండని రాహుల్ రిప్లై ఇచ్చారు.
