అమేథి నుంచి రాహుల్.. రాయ్‌‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ

అమేథి నుంచి రాహుల్.. రాయ్‌‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ
  • కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ

న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌‌లోని  అమేథి నుంచి పోటీచేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని తన ప్రస్తుత సీటు వయనాడ్ నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని తెలిపాయి. అలాగే..రాహుల్ సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్‌‌లోని రాయ్‌‌బరేలీ నుంచి బరిలోకి దిగనున్నట్లు వివరించాయి. 

రాహుల్ 2002 నుంచి 2019 వరకు అమేథి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథి, వయనాడ్ స్థానాల నుంచి రాహుల్ పోటీ చేశారు. అమేథిలో  బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. వయనాడ్‌‌ లో గెలుపొందారు. ఈసారి కూడా రాహుల్ మళ్లీ అమేథి నుంచే పోటీ చేస్తారని.. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని యూపీ కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్ తెలిపారు. బీజేపీ కూడా అమేథి నుంచి మరోసారి స్మృతి ఇరానీని బరిలోకి దింపుతున్నది. ఇటీవల 195 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో అమేథి నుంచి స్మృతి ఇరానీకి మరోసారి అవకాశం ఇచ్చారు.

సోనియా స్థానం ప్రియాంకతో  భర్తీ

పాతికేళ్ల పాటు రాయ్​బరేలీ నుంచి సోనియా గాంధీ లోక్‌‌సభకు ప్రాతినిధ్యం వహించారు.. ఇటీవల రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభలోకి అడుగుపెట్టారు. దీంతో రాయ్‌‌బరేలీలో  ప్రియాంక గాంధీని  నిలబెట్టాలని కోరుతూ ఆమె అభిమానులు పోస్టర్లు వేశారు. ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రియాంకను రాయ్‌‌బరేలీ నుంచే బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ ఇంకా రాయ్‌‌బరేలీ అభ్యర్థిని ప్రకటించలేదు. 2019లో ఆ నియోజకవర్గంలో దినేశ్ ప్రతాప్ సింగ్‌‌ను ఆ  పార్టీ బరిలోకి దింపింది.