యుద్ధం ఆపాను అని పదే పదే అంటున్నా మోదీ నోరు మెదపడం లేదు.. ట్రంప్ కు భయపడుతున్నారు : రాహుల్ గాంధీ

యుద్ధం ఆపాను అని పదే పదే అంటున్నా మోదీ నోరు మెదపడం లేదు.. ట్రంప్ కు భయపడుతున్నారు : రాహుల్ గాంధీ
  • ప్రధానిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్
  • ఇండియా, పాక్ యుద్ధం తానే ఆపానంటున్న ట్రంప్
  • కాదని చెప్పే ధైర్యం లేక మోదీ మౌనం వహించారని విమర్శ
  • కేంద్ర విధానాల వల్లే బిహార్ యువత వలసపోతోందని ఆరోపణ

పాట్నా: భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావారణాన్ని తానే తొలగించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ గుర్తుచేశారు. పాక్ తో యుద్ధం ఆపడంలో కానీ కాల్పుల విరమణ విషయంలో కానీ ట్రంప్ జోక్యమేమీ లేదని బీజేపీ నేతలు చెబుతున్నారని, అయితే, ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి మోదీ భయపడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

ఈ యుద్ధ విరమణలో ట్రంప్​ పాత్రేమీ లేదని చెప్పే ధైర్యం ప్రధానికి లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్లే బిహార్‌‌‌‌ యువత పని కోసం వలసలు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్‌‌‌‌లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే  రైతులు, కార్మికులు, దళితులు, బలహీన వర్గాల ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్‌‌‌‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గురువారం నలందకు చేరుకున్నారు. 

ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.."తన వల్లే ఇండియా, పాకిస్తాన్ ఘర్షణ ఆగిందని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. కానీ, అది అబద్ధమని చెప్పే ధైర్యం మోదీకి లేదు. ట్రంప్‌‌‌‌కు భయపడి ఆయన అమెరికా పర్యటనకు కూడా వెళ్లడం లేదు. బిహార్‌‌‌‌లోని ఎన్డీయే ప్రభుత్వం మోదీకి సన్నిహితంగా ఉండే కంపెనీలకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నది. 

కానీ, పేదల కోసం ప్రభుత్వ భూమి అడిగితే లేదని చెబుతున్నది. మోదీకి సన్నిహితమైన కార్పొరేట్ కంపెనీలు బిహార్ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేవు. గత లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ‘ఓటు చోరీ’ ద్వారా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్డీయే, మోదీ కలిసి రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారు. 

బిహార్‌‌‌‌లో మా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే  రైతులు, కార్మికులు, దళితులు, బలహీన వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తాం. వలసలు తగ్గిస్తం. నలందాలో ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం" అని హామీ ఇచ్చారు.