ఈసీని కబ్జా పెట్టారు.. అన్ని వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట పెట్టుకుంటుంది

ఈసీని కబ్జా పెట్టారు.. అన్ని వ్యవస్థల్ని ఆర్ఎస్ఎస్ గుప్పిట పెట్టుకుంటుంది
  • ఈసీ నియామకాలను మోదీ, అమిత్ షా ఎందుకు డిసైడ్ చేయాలి? 
  • ఆ ప్యానెల్ నుంచి సీజేఐని ఎందుకు తప్పించారు? 
  • ఎన్నికల కమిషనర్లను శిక్షించకుండాఉండేలా చట్టాన్ని ఎందుకు మార్చారు? 
  • సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేసేలానిబంధనలు ఎందుకు మార్చారు?
  • లోక్​సభలో నిలదీసిన ప్రతిపక్ష నేత

న్యూఢిల్లీ:  కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎన్నికల కమిషన్(ఈసీ)ను కబ్జా పెట్టిందని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బీజేపీ, ఈసీ కుమ్మక్కయి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని.. దేశంలో ఓట్ చోరీ కంటే ‘యాంటీ నేషనల్’ పని ఏముందని ప్రశ్నించారు. యూనివర్సిటీలతోపాటు సీబీఐ, ఈడీ, ఈసీ వంటి అన్ని వ్యవస్థల్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తన గుప్పిట్లోకి తీసుకుంటోందని ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం లోక్ సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.  సోమవారం పార్లమెంట్ లో వందేమాతరం గీతంపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ నేతలు తమను ‘యాంటీ నేషనల్’ అని పిలవడం పట్ల రాహుల్ స్పందిస్తూ.. దేశంలో ఓట్ చోరీని మించిన యాంటీ నేషనల్ చర్య లేదన్నారు. హర్యానా ఓటర్ లిస్ట్ లో 22 పేర్ల ముందు బ్రెజిల్ మహిళ ఫొటో వచ్చిందని, మరో మహిళ పేరు 200 సార్లు ఉందని.. ఈ తప్పులను తాను ఇదివరకే బయటపెట్టానన్నారు. హర్యానా, కర్నాటక, మహారాష్ట్రతోపాటు బిహార్​లోనూ ఓట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘ఓట్ చోరీ గురించి నేను పదే పదే చెప్పాను. కానీ, నా ప్రశ్నలకు ఈసీ ఎప్పుడూ జవాబు ఇవ్వలేదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) చేపట్టిన తర్వాత కూడా బిహార్ ఓటర్ లిస్ట్ లో 1.2 లక్షల డూప్లికేట్ ఓటర్లు ఎందుకున్నారో ఈసీ నాకు చెప్పలేదు. మీరుసంస్థను చేతుల్లోకి తీసుకున్నారనేది దీనితో స్పష్టం అవుతోంది. ఈసీ పూర్తిగా పరిధిని దాటి పని చేస్తోందని నేను ఇదివరకే నిరూపించా” అని అన్నారు.

ఎన్నికల కమిషనర్లను వదిలిపెట్టం.. 

ఎన్నికల సంస్కరణలు చాలా సింపుల్ విషయమని, కానీ ఈ పని చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడంలేదని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడేలా ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని ఆరోపించారు. ‘‘వర్రీ కావద్దు. మేం అధికారంలోకి వస్తాం. చట్టాన్ని తిరిగి మారుస్తాం. మిమ్మల్ని పట్టుకుంటాం”అని ఎలక్షన్ కమిషనర్లను ఆయన హెచ్చరించారు. బీజేపీ సైద్ధాంతిక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ విద్యా సంస్థలతోపాటు ఈడీ, సీబీఐ వంటి ఏజెన్సీలు, ఈసీ వంటి సంస్థలను తన గుప్పిట్లోకి తీసుకుంటోందని ఆరోపించారు. ‘‘నేడు యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లను ఎలా నియమిస్తున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసు. వృత్తిపరమైన అర్హతలు ఉన్నాయా? లేదా? అన్నది కాదు.. వారు కేవలం ఓ సంస్థకు చెందినవారా? కాదా? అన్నది మాత్రమే చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి అనుకూలంగా ఉండే బ్యూరోక్రాట్లనే కీలక స్థానాల్లో నియమించుకుంటున్నారు” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

ఈసీ నియామక ప్యానల్​ నుంచి సీజేఐని ఎందుకు తొలగించారు? 

ఎన్నికల కమిషనర్లను నియమించే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)ని ఎందుకు తొలగించారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘చీఫ్ జస్టిస్ పట్ల నమ్మకం లేదా? ప్యానెల్ లో ప్రతిపక్ష నేతగా నాకు స్థానం ఉంది. కానీ, నా వాయిస్ కు అక్కడ చోటులేదు. ప్యానెల్ లో ప్రధాన మంత్రి, ఆయన నామినేట్ చేసే కేంద్ర మంత్రి ఉంటారు. దీనివల్ల ఈసీ నియామకాలను రూలింగ్ పార్టీ కంట్రోల్ చేసేందుకు వీలవుతోంది. ఎన్నికల సంఘంలో ఎవరుండాలన్నదానిని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షానే ఎందుకు నిర్ణయించాలి?” అని అన్నారు. ‘‘ఎన్నికలు జరిగిన తర్వాత సీసీటీవీ ఫుటేజీని డిలీట్ చేసేలా చట్టాన్ని ఎందుకు మార్చారు? ఎన్నికల కమిషనర్లు పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న చర్యలపై విచారణ జరపకుండా, శిక్షించకుండా ఉండేలా చట్టంలో ఎందుకు మార్పులు చేశారు? వారికి అలాంటి అధికారాలను ఎందుకు కట్టబెట్టారు?” అని ప్రశ్నించారు. ‘‘అమిత్ షా సీలింగ్ వైపు చూస్తున్నారు. బహుశా.. ఆయన మాట్లాడినప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని అనుకుంటున్నా” అని చమత్కరించారు.