రాహుల్ గాంధీపై కేంద్రం ఫైర్.. దద్దరిల్లిన పార్లమెంట్

 రాహుల్ గాంధీపై కేంద్రం ఫైర్.. దద్దరిల్లిన పార్లమెంట్

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై లండన్ లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర దుమారం రేపాయి. రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం.. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాహుల్ గాంధీ భారత్ ను అవమానించారని, క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని రాహుల్ విదేశాలను కోరారన్నారు. 

పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సమావేశాలు మార్చి 13న ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే కేంద్ర  రాజ్‌నాథ్ సింగ్‌ ఈ అంశాన్ని  ప్రస్తావించారు. ‘‘విదేశీ గడ్డపై రాహుల్‌ గాంధీ భారత్‌ను అవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులంతా ఖండించాలి. రాహుల్‌ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని రాజ్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలకు భాజపా మిత్రపక్ష నేతలు కూడా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి విమర్శలను కాంగ్రెస్‌ సభ్యులు వ్యతిరేకించారు. ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విదేశాల్లో విమర్శలు గుప్పించారని గుర్తుచేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.