వారణాసి: దేశంలో అభివృద్ధి రెండు పట్టాలపై పరుగులు పెడుతోందని ప్రధాని మోడీ అన్నారు. సొంత నియోజకవర్గం వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఒకవైపు రైల్వేస్, ఎయిర్ వేస్, ఇంటర్నెట్ వంటి మౌలిక వసతులు, ఇంకోవైపు రైతులు, మధ్యతరగతి, శ్రామిక వర్గాల జీవితాలను మెరుగు పరిచేందుకు కృషి జరుగుతోందన్నారు. నాలుగున్నరేళ్లలో రైల్వేలను అభివృద్ధి చేశామన్నారు. భారత్ లోనే తయారైన వందే భారత్ సెమీ హైస్పీడ్ రైలు అందుకు నిదర్శనమన్నారు. భారత ఇంజనీర్లు, టెక్నీషియన్లు 18 నెలలు శ్రమించి దీన్ని తయారు చేశారని చెప్పారు. కానీ కొందరు ఆ కష్టాన్ని అవమానించడం దురదృష్టకరమని మోడీ అన్నారు.
రాహుల్, అఖిలేశ్ వ్యాఖ్యలపై స్పందన
మేకిన్ ఇండియాపై పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. చాలా మంది దీన్ని ఫెయిల్యూర్ గా చూస్తున్నారని, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ ఆలోచిస్తోందని అన్నారు. అలాగే వందే భారత్ ట్రైన్ ను స్టోరీ ఆఫ్ సక్సెస్ గా చెబుతున్నారని, కానీ దానిలో చాలా సాంకేతిక లోపాలు తలెత్తాయని సమాజ్ వాదీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై మోడీ ఇవాళ వారణాసి సభలో స్పందించారు. కొంతమంది సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్ ను అవహేళన చేస్తున్నారని, ఇది దురదృష్టకరమని మోడీ అన్నారు. దాన్ని తయారు చేసేందుకు శ్రమపడిన భారత ఇంజనీర్లు, టెక్నీషియన్లను వారు అవమానిస్తున్నారని మండిపడ్డారు. అటువంటి నెగిటివ్ కామెంట్స్ వల్ల ప్రజలు తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ఆయన కోరారు.
భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ చేస్తారు
వందే భారత్ ప్రాజెక్టుకు పని చేసిన టెక్నీషియన్లు, ఇంజనీర్లకు తాను సెల్యూట్ చేస్తున్నానని మోడీ చెప్పారు. భవిష్యత్తులో వాళ్లు భారత్ లోనే బుల్లెట్ ట్రైన్ ను తయారు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘మన ఇంజనీర్లను అమవానించడం వాళ్ల (రాహుల్, అఖిలేశ్) హక్కా? ఇలా అవమానించడం సరైనదేనా? సరైన సమయంలో సరైన తీరులో వారిని శిక్షించలేమా?’’ అని మోడీ సభలో ప్రజలను అడిగారు.
దేశమంతా వాళ్ల కుటుంబాలకు రుణ పడి ఉంది
పుల్వామా దాడిలో అమరుడైన వారణాసికి చెందిన రమేశ్ యాదవ్ కు మోడీ నివాళి అర్పించారు. దేశం మొత్తం అమరుల కుటుంబాలకు ఎప్పటికీ రుణ పడి ఉంటుందని అన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగం చిరస్మరణీయం అని చెప్పారు.
