
రాజ్‌కోట్: గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ లోని టీఆర్పీ గేమ్ జోన్ లో గత నెల జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని వారికి హామీ ఇచ్చారు. మే 25న రాజ్‌కోట్ లోని గేమ్ జోన్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు పిల్లలు సహా 27 మంది మరణించిన సంగతి తెలిసిందే. శనివారం రాహుల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ కుటుంబాలతో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు వర్చువల్ మీటింగ్ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
కాంగ్రెస్ గుజరాత్ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ ఢిల్లీలో రాహుల్‌తో ఉండగా, ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ఇతర పార్టీ నేతలు బాధితుల కుంటుంబాల వెంట ఉన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం సహా పలు డిమాండ్లు నెరవేర్చాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నది. ప్రమాదం జరిగి నెల రోజులు అవుతున్న నేపథ్యంలో జూన్ 25న రాజ్‌కోట్ బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రజలు, దుకాణదారులు బంద్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు.